హైదరాబాద్, ఆంధ్రప్రభ : రానున్న 2022-23 విద్యా సంవత్సరంలో స్వల్పకాలిక ఒకేషనల్ ఇంటర్ కోర్సులను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఇంటర్‌బోర్డు తెలిపింది. దాదాపు 15 స్వల్పకాలిక కోర్సులను అందించనున్నట్లు ప్రకటించింది. ఇనిస్ట్యూట్ ఆఫ్ ఒకేషనల్ ఎడ్యుకేషన్ (ఎస్‌ఐవీఈ) నేతృత్వంలో ఈ కోర్సులను అందిస్తామన్నారు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఈ కోర్సులను విద్యార్థులకు అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఈ మేరకు కోర్సుల కాలపరిమితి, ఫీజు, విద్యార్హలతో కూడిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. విద్యా సంవత్సరం మొదటి మాడ్యూల్‌లో రెండు నుంచి తొమ్మిది కోర్సుల వరకు అనుమతితో ప్రారంభించుకోవాలని సూచించారు. 3, 4, 9 నెలలు తగిన రుసుము చెల్లించి కోర్సులను ప్రారంభించుకోవాలన్నారు. కాలేజీలు, విద్యార్థులు మరిన్ని వివరాలకు సంస్థ వెబ్‌సై ట్‌ను సంప్రదించాలన్నారు.
ఫీజును కూడా ఆన్‌లైన్‌లోనే చెల్లించాలన్నారు. సీసీటీవీ, మొబైల్ ఆపరేషన్లు, సోలార్ లైటింగ్ టెక్నాలజీ, ఇండస్ట్రీయల్ రోబోటిక్స్ తదితర 15 కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఈ కోర్సులు చేసిన విద్యార్థులకకు సర్టిఫికెట్లు కూడా ఇస్తారని ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రయివేటు, ఎయిడెడ్, అన్ ఎయిడెడ్ , ఎన్‌జీఈవో జూనియర్ కాలేజీలు ఈ కోర్సులను విద్యార్థులకు అందించొచ్చని పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం జులై 2022 నుంచి 3, 6, 9 నెలల కాలపరిమితి కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.