Saturday, November 23, 2024

‘షూటర్ దాది’ కన్నుమూత

“షూటర్ దాది”గా పేరు తెచ్చుకున్న భారత వెటరన్ షూటర్ చంద్రో తోమర్ ఇక లేరు. 60 ఏళ్లు దాటాక షూటింగ్‌ ప్రస్థానాన్ని ఆరంభించి.. ఎన్నో పతకాలు కొల్లగొట్టిన భారత వెటరన్‌ షూటర్‌ చంద్రో తోమర్‌ కన్నుమూశారు. కరోనా వైరస్​తో పోరాడిన 89 ఏళ్ల ఈ షూటర్ బామ్మ శుక్రవారం తుదిశ్వాస విడిచింది. శ్వాస ఇబ్బందుల కారణంగా తోమర్‌ ఏప్రిల్‌ 26న మీరట్‌లోని ఓ ఆస్పత్రిలో చేరారు. అయితే వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌గా తేలడంతో అక్కడే ఆమెకు చికిత్స అందించారు. శుక్రవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో చంద్రో తోమర్‌ చనిపోయినట్టు ఆమె కుటుంబ సభ్యులు వెల్లడించారు.

చంద్రో తోమర్‌ తనను విడిచి వెళ్లిపోయిందని ఆమె మరదలు ప్రకాశి తోమర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేసింది. ‘ఆమె నన్ను వదిలి వెళ్లిపోయింది. చంద్రో నీవెక్కడికి వెళ్లావు?’ అని ప్రకాశి తోమర్‌ ట్వీట్‌ చేశారు. చంద్రో స్ఫూర్తితో తుపాకీ పట్టిన 84 ఏళ్ల ప్రకాశి కూడా వెటరన్‌ షూటర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు.

ఉత్తరప్రదేశ్‌లోని భాగ్‌పట్‌ జిల్లా జోహ్రీ గ్రామానికి చెందిన చంద్రో తోమర్‌ 15 ఏళ్లకే పెళ్లి చేసుకుని.. జీవితంలో ఎన్నో సమస్యలను అధిగమించారు. 60 ఏళ్ల వయస్సులో షూటింగ్‌ కెరీర్‌ను ఎంచుకున్నారు. లేటు వయస్సులో ఈ క్రీడలోకి ప్రవేశించినా.. యువతకు ధీటుగా సత్తాచాటి అందరి హృదయాలు గెలుచుకున్నారు.  ఓ సారి షూటింగ్​లో శిక్షణ పొందాలనుకున్న తన మనవరాలితో తోడుగా వెళ్లిన చంద్రో అక్కడ తుపాకీ తీసుకుని మొదటిసారే లక్ష్యాన్ని గురి పెట్టి కాల్చింది. దీంతో అక్కడున్న కోచ్ దృష్టి ఆమె మీద పడింది. తనను షూటింగ్ శిక్షణ తీసుకోమని కోరాడు. అయితే కుటుంబంలోని పెద్దవాళ్లైన మగవాళ్లు అందుకు నిరాకరించినా.. తన కొడుకులు, కూతుళ్లు, మనవరాళ్ల మద్దతుతో ఆమె శిక్షణ తీసుకుంది.ఆ తర్వాత 30కి పైగా వెటరన్ షూటింగ్ జాతీయ ఛాంపియన్​షిప్స్​లో విజేతగా నిలిచింది. చివరగా 2016లో పోటీల్లో పాల్గొంది. ఆ తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో యువ షూటర్లకు క్రీడలో సూచనలు అందిస్తూ ఉండేది.

ప్రకాశితో కలిసి వెటరన్‌ విభాగంలో జాతీయ స్థాయిలో అనేక పతకాలు సాధించారు. ప్రపంచంలోనే అత్యధిక వయస్సున్న మహిళా షార్ప్‌ షూటర్‌గా తోమర్‌ రికార్డుకెక్కారు. ‘షూటర్‌ దాది’గా పేరొందిన తోమర్‌.. జాతీయ టోర్నీల్లో 30కి పైగా పతకాలు సాధించారు. చంద్రో తోమర్ జీవిత కథ ఆధారంగా ‘సాండ్‌ కి ఆంఖ్‌’ పేరుతో బాలీవుడ్‌లో సినిమా కూడా వచ్చింది. తాప్సి నటించిన ఈ సినిమాకు పలు అవార్డులు కూడా వచ్చాయి.

షూటర్‌ దాది మృతి పట్ల కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్‌ రిజిజుతో పాటు క్రీడా, సినిమా ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. తనదైన ప్రతిభతో షూటర్‌ దాది ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలిచారని, ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని రిజిజు ట్వీట్‌ చేశారు. అనేకమంది అమ్మాయిలు తమ లక్ష్యాలను చేరుకునేందుకు దాది మార్గదర్శిగా నిలిచారని ఆమె జీవితకథ సినిమాలో ప్రధానపాత్ర పోషించిన బాలీవుడ్‌ నటి భూమి పడ్నేకర్‌ పేర్కొన్నారు. కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్‌ పూరి, షూటర్‌ జాయ్‌దీప్‌ కర్మాకర్‌, బాక్సర్‌ అఖిల్‌ కుమార్‌, రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌ తదితరులు దాది మృతికి సంతాపం తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement