Tuesday, November 19, 2024

కరోనా సెకండ్ వేవ్: మద్యం తాగేవారికి హెచ్చరిక

రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారిపై రెండోదశ కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోందని వైద్య నిపుణులు వెల్లడించారు. ముఖ్యంగా మద్యపానం, ధూమపానం అధికంగా సేవించేవారికి కరోనా వస్తే కోలుకునే రేటు తక్కువగా, మరణాల రేటు అధికంగా ఉంటోందని తెలిపారు. మద్యపానం సేవించేవారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటమే దీనికి కారణమని విశ్లేషించారు. తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌), భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఆధ్వర్యంలో సంయుక్త ఆధ్వర్యంలో శనివారం వెబినార్‌ జరిగింది.

ఈ సందర్భంగా పలువురు వైద్య నిపుణులు మాట్లాడారు. తొలి దశ కరోనా వృద్ధులు, ఇతర దీర్ఘకాలిక రోగాలున్న వారిపై ఎక్కువ ప్రభావం చూపించగా.. రెండో దశలో యువత, చిన్నారులు, గర్భిణులు సైతం దీని బారిన పడుతున్నారని వైద్య నిపుణులు తెలిపారు. గర్భిణులు పాజిటివ్‌గా ఉంటే ప్రసవం తర్వాత, అప్పుడే పుట్టిన పిల్లలకు వైరస్‌ ఉన్నట్టు ఇంతవరకు తేలలేదన్నారు. కానీ ప్రసవం తర్వాత శిశువులకూ పాజిటివ్‌ వస్తోందన్నారు. శిశువులు, చిన్నారుల్లో తీవ్రత మాత్రం ఎక్కువగా ఉండటం లేదని, అయినా జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. చిన్నారుల్లో గొంతులో ఇబ్బంది, అన్నం తినడానికి ఇబ్బంది పడటం, జ్వరం, విరేచనాలు చిన్నారుల్లో కరోనా లక్షణాలు అని పేర్కొన్నారు. కరోనా నుంచి కోలుకున్నాక 4 వారాల తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవచ్చన్నారు. రెండు డోసులు పూర్తయిన 15 రోజుల తర్వాతే మెరుగైన ఫలితాలు కనిపిస్తాయని వారు సూచించారు. ప్రస్తుతం 18 ఏళ్ల లోపు చిన్నారులకు వ్యాక్సిన్ వేయించవద్దని.. వీరికి వ్యాక్సిన్ ఇవ్వాలా, లేదా అన్న అంశంపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement