వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ జిల్లాలో అధికార టీఆర్ఎస్ పార్టీకి ఓటమి తప్పదా? జిల్లాలో బీజేపీ తిరుగులేని శక్తిగా ఎదుగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఈ మేరకు ఓ సర్వే తేల్చి చెప్పింది. గత పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కవిత ఓడిపోయిన నాటి నుంచి టీఆర్ఎస్ కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. నిజామాబాద్ ఎంపీగా ధర్మపురి అరవింద్ గెలిచినప్పటి నుంచి జిల్లాపై ఆయన పట్టు సాధిస్తున్నారు. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 7 స్థానాల్లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అయితే, ఆయా స్థానాల్లో పాగ వేయడానికి బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది.
తాజాగా ఒక పత్రిక నిజామాబాద్ జిల్లాలో సర్వే చేసింది. ఈ సర్వేలో అధికార టీఆర్ఎస్ పార్టీకి షాక్ ఇస్తు ఫలితం వచ్చింది. నిజామాబాద్ లో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 5 స్థానాల్లో బీజేపీయే గెలుస్తుందని ఆ సర్వే తేల్చింది. ఈ సర్వే ఫలితాన్ని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, కోరుట్లతో పాటు బోధన్ లో బీజేపీయే విజయం సాధిస్తుందని సర్వేలో తెలిందని ఎంపీ అరవింద్ తెలిపారు. అలాగే మిగిలిన రెండు స్థానాల్లో కూడా ఎన్నికల నాటికి పరిస్థితులు మారే అవకాశం ఉన్నాయని వెల్లడించారు.