Friday, November 22, 2024

కాంగ్రెస్ కి షాక్- కీల‌క ప‌దవుల‌కి రాజీనామా చేసిన గులాం న‌బీ ఆజాద్

జ‌మ్మూ క‌శ్మీర్ లో పార్టీ ప్ర‌చార క‌మిటీ ఛైర్మ‌న్ గా నియ‌మితులైన కొద్దిసేప‌టికే ఆ ప‌ద‌వి నుంచి వైదొలిగారు కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు గులాం న‌బీ ఆజాద్.కాగా ఆ పార్టీ జమ్మూ కశ్మీర్ రాజకీయ వ్యవహారాల కమిటీకి కూడా రాజీనామా చేయ‌డం విశేషం. అయితే పార్టీ అధిష్టానంపై ఆజాద్ కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ అసంతృప్తి గళం వినిపిస్తున్న సీనియర్‌ నేతల జీ23 గ్రూప్‌లో ఆజాద్‌ కూడా ఉన్నారు. ఇటీవల ఆజాద్ రాజ్యసభ పదవీకాలం ముగియగా.. ఆయనకు కాంగ్రెస్ మరో అవకాశం ఇవ్వలేదు. దీంతో ఆయన పార్టీ అధిష్టానంపై గుర్రుగా ఉన్నట్టుగా వార్తలు వచ్చాయి.

ఆరోగ్య కారణాల దృష్ట్యా గులాం నబీ ఆజాద్ కొత్త బాధ్యతలను స్వీకరించడానికి నిరాకరించినట్లుగా ఆయన సన్నిహిత వర్గాలు తెలిపాయి. అయితే కాంగ్రెస్ అధిష్టానంపై అసంతృప్తితోనే అజాద్ ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఆలిండియా కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీలో సభ్యునిగా ఉన్న ఆజాద్.. జమ్మూ కశ్మీర్‌లో పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌గా నియమించి తన హోదాను తగ్గించారనే భావనలో ఉన్నార‌ట‌. కాగా ఆజాద్‌ తన సన్నిహితుడు గులాం అహ్మద్‌ మీర్‌ను పార్టీ జమ్మూ కాశ్మీర్‌ విభాగం చీఫ్‌ పదవి నుంచి తొలగించిన కొద్దిసేపటికే రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. అహ్మద్ మీర్ గత నెలలో పదవికి రాజీనామా చేయగా.. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ దానిని ఆమోదించారు. ఆజాద్.. గతంలో జమ్మూ కశ్మీర్ కేంద్ర మంత్రిగా, కాంగ్రెస్ పార్టీలో అనేక కీలక పదవులను నిర్వర్తించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement