బ్యాంకింగ్ లావాదేవీలంటేనే ఇప్పుడు డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులతోనే మొదలవుతాయి. దీనికి తోడు సేవింగ్స్ ఖాతాల్లో కనీస నిల్వలు లేకపోతే ఆయా బ్యాంకులు జరిమానా విధిస్తున్నాయి. ఇక క్రెడిట్ కార్డులు సంబంధిత యూజర్ల ఆదాయాన్ని బట్టి బ్యాంకులు జారీ చేస్తాయి. ఇక్కడే సమస్య ఉంది. బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌లు అవసరం లేకున్నా.. ఇతర బ్యాంకుల ఖాతాదారులకు ఫోన్ చేసి క్రెడిట్ కార్డులు తీసుకోవాలని సూచిస్తుంటారు. ఆయా క్రెడిట్ కార్డుల వాడకాన్ని బట్టి బిల్లు సకాలంలో చెల్లిస్తే నో ప్రాబ్లం. లేని పక్షంలో పెనాల్టీ బిల్లుల మోత మోగుతుంది.
అత్యధిక విలువ గల క్రెడిట్ కార్డు సర్వీస్ చార్జీలు కూడా ఎక్కువే. క్రెడిట్/ డెబిట్ యూజర్లు మోసాలకు గురవుతుంటారు. ఈ మోసాలు, చార్జీల భారీ నుంచి ఖాతాదారులను రక్షించడానికి భారతీయ రిజర్వు బ్యాంకు సంసిద్ధమైంది. అందుకు మార్గదర్శకాలు జారీ చేసింది. వచ్చే జూలై ఒకటో తేదీ నుంచి ఈ మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయి. తత్ఫలితంగా డెబిట్/ క్రెడిట్ కార్డుల వాడకందారులకు రక్షణతోపాటు సేవల్లో పారదర్శకత పెరుగుతుందని ఆర్బీఐ పేర్కొంది.
ఆ మార్గదర్శకాలేంటంటే..!
ఎవరైనా ఖాతాదారుడు తన క్రెడిట్ కార్డు క్లోజ్ చేయాలని విజ్ఞప్తి చేస్తే.. సంబంధిత బ్యాంకు యాజమాన్యం దాన్ని వారంలో పరిష్కరించాలి.
క్రెడిట్ కార్డ్ క్లోజ్ చేసిన అంశంపై ఖాతాదారుడికి వెంటనే మెసేజ్, ఈ-మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వాలి.
క్రెడిట్ కార్డు వాడకం దారుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ఈ-మెయిల్ ఐడీ క్రియేట్ చేయాలి.
ఐవీఆర్ సేవలను ఉపయోగించుకోవాలి.
ప్రతి బ్యాంకు తమకు వచ్చిన ఫిర్యాదుల వివరాలు సొంత వెబ్‌సైట్‌తోపాటు ఇంటర్నెట్ బ్యాంకింగ్‌లో ప్రత్యేకంగా కనిపించేలా చూడాలి.
క్రెడిట్ కార్డులను మూసివేయాలని వచ్చే విజ్ఞప్తులను స్వీకరించడానికి సరళీకృత విధానాన్ని అమలు చేయాలి.
క్రెడిట్ కార్డు రద్దు చేయాలని పోస్ట్, ఇతర మీడియా వేదికల ద్వారా నిబంధన విధించరాదు.
ఏడాది కంటే ఎక్కువ కాలం క్రెడిట్ కార్డు వాడని పక్షంలో సంబంధిత యూజర్‌కు సమాచారం ఇచ్చి ఆ క్రెడిట్ కార్డు ఖాతా మూసివేత ప్రక్రియ మొదలు పెట్టాలి.
నెల రోజుల్లో కార్డు యజమాని నుంచి వచ్చే జవాబును బట్టి దాని మూసివేతకు చర్యలు తీసుకోవాలి. దానిపై బకాయిలు ఉన్నాయా? లేదా? అన్న సంగతి చెక్ చేసుకోవాలి.
నెల గడువులోపు క్రెడిట్ ఇన్‌ఫర్మేషన్ సంస్థతో కార్డు మూసివేత రికార్డును అప్‌డేట్ చేయాలి.
క్రెడిట్ కార్డు ఖాతాను మూసేశాక.. ఆ ఖాతాలో ఉన్న నగదును యజమాని బ్యాంకు ఖాతాకు ట్రాన్స్‌ఫర్‌చేయాలి.
క్రెడిట్ కార్డు చార్జీల్లో మార్పులుంటే.. నెల రోజుల ముందే యూజర్‌కు తెలియజేయాలి.
కార్డు యాక్టివేట్ కాకముందే సిబిల్, ఎక్స్‌పీరియన్స్ వంటి క్రెడిట్ బ్యూరో సంస్థలకు సమాచారం ఇవ్వొద్దు.
క్రెడిట్ కార్డు ద్వారా ఇచ్చే ఈఎంఐ (నెలసరి వాయిదా) విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలి.
డెబిట్ కార్డులు ఎవరికివ్వాలంటే..
సేవింగ్స్, కరంట్ ఖాతాలు గల ఖాతాదారులకు మాత్రమే డెబిట్ కార్డులు ఇవ్వాలి.
రుణ అకౌంట్‌లు గల ఖాతాదారులకు డెబిట్ కార్డులు జారీ చేయరాదు.
డెబిట్ కార్డు తీసుకోవాలని ఖాతాదారుడిపై ఒత్తిడి తేవొద్దు.
డెబిట్ కార్డు తీసుకుంటేనే ఇతర వసతులు ఉంటాయని షరతులు వర్తింప చేయొద్దు.