Saturday, November 23, 2024

మునావ‌ర్ ఫారూకీకి షాక్- ఢిల్లీలో ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి ర‌ద్దు

ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9.30 గంటల వరకు డాక్టర్ ఎస్ పీఎం సివిక్ సెంటర్ (కేదార్ నాథ్ సాహ్ని ఆడిటోరియం)లో మునావర్ ఫారూకీ షో జరగాల్సి ఉంది. మతసామరస్యానికి విఘాతం కలుగుతుందన్న కారణంపై ఢిల్లీ సెంట్రల్ డిస్ట్రిక్ట్ పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రైవేటుగా నిర్వహించుకునే మునావర్ ఫారూకీ షో నిర్వహణకు పోలీసులు లోగడ అనుమతి జారీ చేశారు. ఫారూకీ గత వారం బెంగళూరులో నిర్వహించాల్సిన షో కూడా రద్దు కావడం తెలిసిందే. ఆ మర్నాడే హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో మునావర్ ఫారూకీ షో విజయవంతంగా జరిగింది. 1,000 మంది పోలీసులతో, పటిష్ఠ భద్రత నడుమ తెలంగాణ సర్కారు షో నిర్వహణకు సహకారం అందించింది.

ఈ షోకు అనుమతి రద్దు చేయాలని తెలంగాణ బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేయడం తెలిసిందే. రాజాసింగ్ డిమాండ్ ను తెలంగాణ సర్కారు పట్టించుకోకపోవడంతో, ఆయన వివాదాస్పద వీడియో విడుదల చేయడం, దీనిపై పోలీసులు అరెస్ట్ చేయడం గమనార్హం. ఇదిలావుంచితే, ఫారూకీని ఈ ఏడాది జనవరి 1న మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేశారు. హిందూ దేవుళ్లు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వ్యతిరేకంగా మునావర్ అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినందుకు చర్యలు తీసుకోవాలని, బీజేపీ ఎమ్మెల్యే లక్ష్మణ్ సింగ్ గౌడ్ కుమారుడు ఏకలవ్య సింగ్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు ఈ చర్య తీసుకున్నారు. అనంతరం ఆయన బెయిలుపై విడుదలయ్యారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement