కర్నాటక రాష్ట్రంలోని శివమొగ్గలో తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను ఇవ్వాల (మంగళవారం) పోలీసులు అరెస్టు చేశారు. వీరు నిషేధిత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ ముఠా సభ్యులు పేలుడు పదార్థాలను కలిగి ఉన్నారని, రాష్ట్రవ్యాప్తంగా పేలుళ్లకు ప్లాన్ చేశారని పోలీసులు తెలిపారు.
నిందితులైన షరీక్, మాజీ, సయ్యద్ యాసిన్‌పై చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (యూఏపీఏ) కింద కేసు నమోదు చేశారు. ఈ గ్యాంగ్ సభ్యులు దేశ ఐక్యత, సమగ్రత, సార్వభౌమత్వానికి హాని కలిగించే ఐఎస్ కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. వీరికి ఐఎస్‌తో సంబంధాలున్నాయని హోంమంత్రి ఆరగ జ్ఞానేంద్ర అన్నారు. వారి కార్యకలాపాలపై తీవ్ర విచారణ జరుగుతోందన్నారు.
అరెస్టయిన వ్యక్తులు పేలుళ్లు చేయడంతోపాటు ఉగ్రవాద శిక్షణ పొందారని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. కింగ్‌పిన్ యాసిన్‌ను అరెస్టు చేసి ఎంక్వైరీ చేస్తున్నారు. యాసిన్ ఒక ఎలక్ట్రికల్ ఇంజనీర్ అని పోలీసు అధికారులు తెలిపారు. ఈ ఏడాది ప్రారంభంలో రాష్ట్రంలో హిజాబ్ ఘటన హింసాయుత ఘటనలకు దారితీసింది. అందులో హిందూత్వ కార్యకర్త హర్షను నరికి చంపినప్పుడు శివమొగ్గ ఉడికిపోయింది. ఆగస్టులో హిందూత్వ సిద్ధాంతకర్త వినాయక్ దామోదర్ సావర్కర్ పోస్టర్‌ను చించడంతో ఘర్షణలు చెలరేగాయి. ఈ ఘర్షణల్లో 20 ఏళ్ల యువకుడు కత్తి పోట్లకు గురై తీవ్రంగా గాయపడ్డాడు. కాగా ఇవ్వాల అరెస్టు అయిన వారిలో ఒకరికి పాకిస్థాన్ ఉగ్రవాద గ్రూపులతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు తెలిపారు.