Wednesday, November 20, 2024

శివసేన, బీజేపీ మళ్లీ కలిసే అవకాశం ఉందా?

మహారాష్ట్రలో మళ్లీ అధికారాన్ని కైవసం చేసుకునేందుక బీజేపీ పావులు కదుపుతుందా? ప్రస్తుతం కొనసాగుతున్న సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చేందుకు వ్యూహాలు రచిస్తుందా? బీజేపీ-శివసేన మళ్లీ కలిసే అవకాశం ఉందా ? అనే చర్చలు జరుగుతున్న వేళ్ల.. మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేపుతున్నాయి.

పాత మిత్రులైన బీజేపీ, శివసేనల మధ్య వైరం కొనసాగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో కలిసి పోటీ చేసిన ఈ రెండు పార్టీలూ.. అధికారాన్ని చేపట్టేందుకు వైరి వర్గాలుగా మారిపోయాయి. దీంతో కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అప్పటి నుంచి రెండు పార్టీల నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. శివసేనపై అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ కూడా అనేక సందర్భాల్లో శివసేనను విమర్శించారు. తాజాగా శివసేన ఎప్పటికీ తమ శత్రువు కాదని ఫడ్నవీస్ చేసిన కీలక వ్యాఖ్యలు రాజకీయంగా చర్చనీయాంశమైయ్యాయి.

శివసేన తమకు ఎప్పుడూ శత్రువు కాదని ఫడ్నవిస్ అన్నారు. మాజీ మిత్రులైన బీజేపీ, శివసేన మళ్లీ కలిసే అవకాశం ఉందా? అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు బదులుగా ఆయన ఈ సమాధానం ఇచ్చారు. శివసేన తమకు మిత్రుడేనని ఆయన చెప్పారు. అయితే ఎవరిపైన అయితే గతంలో కలిసి పోరాడామో… ఇప్పుడు వారితోనే కలిసి శివసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని తెలిపారు. రాజకీయాల్లో ఏదీ స్థిరంగా ఉండదని… పరిస్థితులను బట్టి నిర్ణయాలు ఉంటాయని చెప్పారు.

మరోవైపు ఎన్సీపీకి చెందిన నేతలపై కేంద్ర సంస్థలు చర్యలు తీసుకున్న నేపథ్యంలో మహారాష్ట్ర రాజకీయాలు వేడెక్కాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ఈడీ, సీబీఐ కేసులు నమోదుచేయడం బీజేపీ ప్రయత్నాల్లో భాగమేనని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. విపక్షాలను దెబ్బతీసేందుకు కేంద్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని శివసేన, ఎన్సీపీ ఆరోపించాయి. మహారాష్ట్రలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందని మండిపడ్డాయి. సంకీర్ణ ప్రభుత్వంలో చీలికలు రాబోతున్నాయనే ప్రచారం కూడా మొదలైంది. ఇటీవల ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్, ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే మధ్య కీలక భేటీ జరిగింది. గత నెలలో ఢిల్లీకి వెళ్లిన సీఎం ఉద్ధవ్.. ప్రధాని నరేంద్ర మోదీతో ఏకాంతంగా భేటీ కావడం పలు ఊహాగానాలకు తెరలేచింది. అయితే, ఇది రాజకీయ సమావేశం కాదని శివసేన వివరణ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఫడ్నవిస్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.

ఇది కూడా చదవండి: పాదయాత్ర ఫార్ములా వర్క్ ఔట్ అయ్యేనా?

Advertisement

తాజా వార్తలు

Advertisement