రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్లలో ఎర్ర బంగారం అయిన మిర్చి ధర రికార్డు స్థాయిలో పలుకుతోంది.. వరంగల్ వ్యవసాయ మార్కెట్‌లో మిర్చి ధర పైపైకి దూసుకెళ్లింది. గురువారం దేశీ రకం మిర్చి క్వింటాల్‌కు రాష్ట్ర మార్కెట్ల చరిత్రలోనే తొలిసారి గరిష్టంగా రూ.32,000 ధర పలికింది. తేజ రకానికి రూ.18,000, వండర్‌హాట్‌కు రూ.20,000, యూఎస్ 341 రకానికి రూ.23,500, దీపిక రకానికి రూ.20,000, దేవునూరి డీలక్స్ రూ.23,000, 1048 రకానికి రూ.18,200, 334 రకానికి రూ.17,500, తాలు రకానికి రూ.9,000 ధర లభిస్తోంది. మరోవైపు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు ఈ సీజన్‌లోనే అత్యధికంగా 80 వేల మిర్చి బస్తాలు అమ్మకానికి రావడం గమనించాల్సిన విషయం..
కాగా, రెండో కోత చేతికి రావడంతో రైతులు పంటను మార్కెట్‌కు తరలిస్తున్నారు. ఈసారి మిర్చి దిగుబడులు తక్కువగా ఉన్నప్పటికీ మార్కెట్‌లో ఆశించిన మేరకు ధర రాకపోవడంతో కొంతకాలంగా రైతులు నిరాశలో ఉన్నారు. కొద్దిరోజుల క్రితం వరంగల్లోని ఏనుమాముల మార్కెట్‌లో ఆందోళన కూడా నిర్వహించారు. ఈ నేపథ్యంలోనే తాజాగా అత్యధిక ధర పలకడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.