సినీ సెలబ్రిటీలతో పాటు పలువురు బిజినెస్ మ్యాన్ లని మోసం చేసిన కేసులో శిల్ప చౌదరి చేసిన మోసాలు ఒక్కొకటిగా బయటికి వస్తున్నాయి..అధిక వడ్డీలు ఇస్తామని దాదాపు రూ. 200కోట్లకి కుచ్చు టోపీ పెట్టింది. దాంతో జైలుపాలయింది. పార్టీలు ఇచ్చి సెలబ్రిటీలను ఆకర్షించడమే శిల్ప పని. అయితే ఇప్పుడు పలువురు ప్రముఖులు ఈమెపై కేసు పెట్టేందుకు పోలీస్ స్టేషన్ బాట పడుతున్నారు. కాగా నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు కావడంతో శిల్పా చౌదరితో పాటు ఆమె భర్త కూడా జైలుపాలయ్యారు. ఇది ఇలా ఉండగా వారిపై తాజాగా మరో కేసు నమోదైంది. రూ.2కోట్ల 50 లక్షల తీసుకుని మోసం చేసిందని ప్రియా అనే మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తమ పిల్లల వివాహం కోసం దాచుకున్న డబ్బును అధిక వడ్డీ ఆశతో శిల్పకు ఇచ్చామని బాధిత మహిళ తెలిపింది. గత రెండు ఏళ్ల నుంచి వడ్డీ కట్టలేదని.. డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదని ఫిర్యాదులో పేర్కొంది. కాగా, ఇప్పటివరకు నార్సింగిలో నాలుగు, జూబ్లిహీల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ పీఎస్ లో మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేశారు పోలీసులు.
ఇదిలా ఉంటే ఒక్క నార్సింగి పరిధిలోనే సుమారు రూ.10 కోట్ల మోసానికి పాల్పడిందని పోలీసులు భావిస్తున్నారు. ట్విన్ సిటీలో ఈమె బాధితులు ఉన్నారని.. మొత్తం రూ.70కోట్లకు పైగా మోసం చేసి ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. సినీ ప్రముఖుల నుంచి ఇండస్ర్టీయలిస్ట్‌ల వరకు ఎవరినీ వదిలి పెట్టలేదు. హంగూ.. ఆర్భాటం ప్రదర్శిస్తూ పలువురు సెలబ్రెటీలను బుట్టలో వేసుకొని కోట్లలో బురిడీ కొట్టించారూ కిలాడీ దంపతులు. రియల్ ఎస్టేట్‌లో లాభాలిస్తామంటూ ప్రముఖుల నుంచి భారీగా వసూలు చేశారు. అలా కొంత కాలం పాటు దండిగా దండుకొని హై లెవల్‌లో సంపాదించుకున్నారు. ఇంకేముందు అప్పులిచ్చిన వారు డబ్బులు అడగడం మొదలు పెట్టడంతో.. బౌన్సర్లను నియమించుకుంది. ఎవరైనా డబ్బులు అడిగేందుకు ఇంటికి వస్తే.. బెదిరించడం మొదలు పెట్టింది. దీంతో ఓ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయటంతో వీరి ఈ మాయనాటకం వెలుగుచూసింది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..