Friday, November 22, 2024

Succes Story | జీవితాలనే మార్చేసిన ఓ గొప్ప పథకం​.. ఆర్థికంగా బలపడతున్న గొల్ల కుర్మలు

ఐదేళ్ల క్రితం వికారాబాద్‌ జిల్లా బంట్వారానికి చెందిన రైతు దంపతులు కల్‌కోడ చంద్రప్ప, అమృతమ్మ దంపతులు తమ ముగ్గురు పిల్లలకు రెండు పూటలా భోజనం పెట్టలేకపోయారు. వాళ్లకున్న ఒక ఎకరంలో పత్తి, మొక్కజొన్న పంటలు వేసేది. అయినా వారి పిల్లల చదువులకు సరిపోయేంత సంపాదన ఉండేది కాదు.. అయితే ఇప్పుడు చంద్రప్ప కథ వేరేలా ఉంది. అతని పెద్ద బిడ్డ అగ్రికల్చర్ ఎక్స్ టెన్షన్ ఆఫీసర్‌గా పనిచేస్తుండగా, చిన్న బిడ్డ ఇంజనీరింగ్ చదువుతోంది. ఈ దంపతుల ఏకైక కుమారుడు పాలిటెక్నిక్‌ చదువుతున్నాడు.  ఇదే చంద్రప్ప ఇప్పుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్​ తీసుకొచ్చిన ఫ్లాగ్​షిప్​ గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పొగుడుతున్నాడు. కేసీఆర్​కు ధన్యవాదాలు చెబుతున్నాడు. ఈ పథకం ద్వారా తన కుటుంబానికి సంవత్సరానికి రూ. 9.6 లక్షలు సమకూరిందని, తనకెంతో ఆర్థికంగా సహాపడిందని సంబురంగా చెబుతున్నాడు. అతనికిప్పుడు 80కి పైగా గొర్రెలు కూడా ఉన్నాయి.

– నాగరాజు చంద్రగిరి, ఆంధ్రప్రభ

కురుమ సామాజిక వర్గానికి చెందిన చద్రప్ప తెలంగాణ ప్రభుత్వ గొర్రెల పంపిణీ పథకం కింద వేలాది మంది లబ్ధిదారులలో ఒకరు. ఫిబ్రవరి, 2018లో ఒక్కో యూనిట్‌కు రూ.1.25 లక్షలతో 20 గొర్రెలు, ఒక పొట్టేలుతో కూడిన యూనిట్‌ అతనికి మంజూరు అయ్యింది. గొర్రెలతో పాటు 206 కిలోల దాణా, రూ.400 విలువైన మందులను కూడా ప్రభుత్వం చంద్రప్ప ఇంటికి తీసుకెళ్లి మరీ అందజేసింది. స్థానిక పశువైద్య శాఖ అధికారుల ఆధ్వర్యంలో చంద్రప్ప, అమృతమ్మ దంపతులు తమ గొర్రెలను 100 శాతం బతికించుకున్నారు. ఇప్పుడు ఆ గొర్రెలు 24 ఆడ, 20 మగ అంటే.. మొత్తం 44 గొర్రెలకు జన్మనిచ్చాయి. 36 గొర్రె పిల్లలను అమ్మడం ద్వారా మొదటి సంవత్సరంలో ఆ కుటుంబం రూ.2.1 లక్షలకు పైగా సంపాదించింది. చంద్రప్ప గొర్రెల పునరుత్పత్తి కోసం మరో రెండు పొట్టేళ్లను కొనుగోలు చేశాడు. ప్రస్తుతం మందలో 80కి పైగా గొర్రెలున్నాయి. అతని వార్షిక ఆదాయం దాదాపు రెండింతలు పెరిగి రూ.9.6 లక్షలకు చేరుకుంది.

ముగ్గురు పిల్లలకు మంచి చదువులు..

చంద్రప్ప, అమృతమ్మ అప్పు తీసుకోకుండా ముగ్గురు పిల్లలకు మంచి విద్యను అందించడంలో విజయం సాధించారు. గొర్రెల పంపిణీ పథకం ద్వారా తాము ఎటువంటి రుణం తీసుకోకుండానే ముగ్గురు పిల్లలకు మంచి విద్యను అందిస్తున్నామని సంతోషంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్​కు కృతజ్ఞతలు చెబుతున్నారు. 

- Advertisement -

ఇక.. నల్గొండ జిల్లా ముదిమాణిక్యం గ్రామానికి చెందిన బి భూలక్ష్మి, మంచిర్యాల జిల్లా సీతారాంపల్లెకు చెందిన ఎం. శ్రీనివాస్ యాదవ్ వంటి గొల్ల, కురుమ సామాజిక వర్గాలకు చెందిన అనేక కుటుంబాలు గొర్రెల పంపిణీ పథకం ద్వారా లబ్ధిపొందాయి.. ఇట్లాంటి  విజయగాథలకు ఇప్పుడు తెలంగాణలో కొదువలేదు. .  

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం..

గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడం.. గొర్రెల కాపరులకు స్థిరమైన జీవనోపాధి కల్పించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. మొదటి దశ కింద ఒక్కో కుటుంబానికి 75 శాతం సబ్సిడీపై రూ.1.25 లక్షల యూనిట్ ధరతో 20 గొర్రెలను అందజేశారు. పథకం అమలు కోసం మొత్తం రూ.4,980.31 కోట్లు ఖర్చు చేశారు. దాదాపు 82.74 లక్షల గొర్రెలను ఇతర రాష్ట్రాల నుంచి సేకరించి 3.92 లక్షల మంది ప్రాథమిక గొర్రెల పెంపకందారుల సహకార సంఘాల (పీఎస్‌బీసీఎస్) సభ్యులకు పంపిణీ చేశారు.

రాష్ట్ర ప్రభుత్వ కృషి కారణంగా, PSBCS సంఖ్య 3.92 లక్షల నుండి 7.61 లక్షల మంది సభ్యులతో 8,109కి పెరిగింది. 2019లో కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన 20వ పశుగణన ప్రకారం రాష్ట్రంలో గొర్రెల సంఖ్య కూడా గణనీయంగా పెరిగి 1.28 కోట్ల నుంచి 1.91 కోట్లకు చేరుకుంది. ఇప్పటి వరకు 1.30 కోట్ల గొర్రె పిల్లలు పుట్టగా రూ.6,500 కోట్లు వచ్చాయి.  

మాంసం ఎగుమతుల్లో తెలంగాణ దేశంలోనే టాప్​..

ఇంకా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవతో మాంసం ఉత్పత్తిలో కూడా భారీ పెరుగుదల కనిపించింది.- 2014-15లో 5.05 లక్షల టన్నుల నుండి 2021-22 నాటికి 9.75 లక్షల టన్నులకు, తెలంగాణ దేశంలోనే ఐదవ అతిపెద్ద మాంసం ఉత్పత్తిదారుగా నిలిచింది. రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్ తర్వాత దేశంలో ఉన్ని ఉత్పత్తిలో రాష్ట్రం మూడవ స్థానంలో ఉంది. 2019-20లో తెలంగాణలో 3.96 లక్షల కిలోల ఉన్ని ఉత్పత్తి అయింది.

తెలంగాణ రాష్ట్ర గొర్రెలు, మేకల అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ మీడియాతో మాట్లాడుతూ.. పథకం అమలుపై నిరాధార ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలకు రాష్ట్రంలోని గొర్రెల కాపరుల విజయగాథలు తగిన గుణపాఠంగా మారాయన్నారు.. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆలోచనలో పడిన ఈ పథకం యాదవ సామాజికవర్గం సామాజిక-ఆర్థిక సాధికారతకు సాధనంగా మారిందని ఆయన చెప్పారు. ‘‘గొర్రెల పంపిణీ పథకాన్ని విజయవంతంగా అమలు చేశాం, దాని ఫలాలు అందరికీ కనిపిస్తున్నాయి. 6,000 కోట్ల వ్యయంతో రెండవ దశ పథకం ప్రారంభించాం.  పథకం కింద అర్హులైన వ్యక్తులందరికీ గొర్రెల యూనిట్లు అందిస్తాం”అని ఆయన చెప్పారు.

రెండో దశ పథకానికి సన్నాహాలు.. పైలెట్​ ప్రాజెక్టుగా నల్గొండ, యాదాద్రి జిల్లాలు

పథకం యొక్క మొదటి దశ విజయవంతం కావడంతో, రాష్ట్ర ప్రభుత్వం 3.5 లక్షల మంది అర్హులైన దరఖాస్తుదారులకు ప్రయోజనం చేకూర్చేందుకు రెండో దశ పంపిణీని ప్రారంభించింది. పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుని గొర్రెల యూనిట్ ధరను కూడా రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచారు. రెండో దశ మొత్తం ఆర్థిక వ్యయం రూ.6,125 కోట్లుగా నిర్ధేశించారుం. 75 శాతం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయడం ద్వారా గొర్రెలను స్వయంగా కొనుగోలు చేసేలా ప్రభుత్వం పైలట్ ప్రాజెక్ట్ ను కూడా ప్రారంభించింది. దీని ప్రకారం నల్గొండ, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఈ పథకం కింద 4,699 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఒక్కొక్కరికి రూ.1.58 లక్షల చొప్పున వచ్చే 15 రోజుల్లో జమకానున్నాయి. ఇది విజయవంతంగా అమలైతే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు కూడా విస్తరిస్తారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement