మహిళల్లో నాయకత్వ లక్షణాలు, సామర్థ్యం పెంచేందుకు జాతీయ మహిళా కమిషన్ షి ఈజ్ ఏ చేంజ్‌మేకర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. క్షేత్రస్థాయిలో గ్రామాల్లోని మహిళా నేతల్లో నాయకత్వ లక్షణాలు పెంచడం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా నిర్ణయాలు ఎలా తీసుకోవాలి, ఎలా మాట్లాడాలి, చెప్పాలి, రాయాలో మహిళలకు శిక్షణ ఇస్తారు.
గ్రామ పంచాయతీ వార్డు మెంబర్, సర్పంచ్ దగ్గరి నుంచి పార్లమెంటు ఎంపీల వరకు, అలాగే వివిధ జాతీయ, రాష్ట్ర పార్టీల మహిళా నేతలకు శిక్షణ ఇవ్వనున్నారు. ప్రాంతాల వారీగా శిక్షణ సంస్థలతో కలిసి జాతీయ మహిళా కమిషన్ ఈ శిక్షణ ఇస్తుంది. రాజకీయాల్లో ఎదగాలనుకునే మహిళలకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగపడనుంది.