హైదరాబాద్,ఆంధ్రప్రభ :వచ్చే ఎన్నికల్లో ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం రాష్ట్రంలో కీలక నియోజకవర్గాలలో ఒకటి కాబోతోంది. ఈ నియోజకవర్గం జిల్లా కేంద్రం ఖమ్మంకు పక్కనే ఉండడం, చైతన్య వంతులైన ఓటర్లు ఎక్కువ సంఖ్యలో ఉండడంతో ప్రధాన పార్టీల్లోని ముఖ్య నాయకులు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఇప్పటి నుంచే రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అధికార బీఆర్‌ఎస్, దాని మిత్రపక్షాలైన సీపీఎం, సీపీఐ, వైఎస్‌ఆర్టీపీ, సీపీఐ ఈ నియోజకవర్గం నుంచి పోటీకి సన్నాహాలు చేస్తున్నాయి. వైఎస్‌ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచే పోటీ చేస్తానని ప్రకటించారు.సొంత ఇల్లు కూడా కట్టుకుంటున్నారు.వైఎస్‌ఆర్టీపీ ఆమె సొంత పార్టీ అయినందున ఆమెనే రంగంలో ఉంటారు. కాబట్టి ఆమె పోటీ ఖరారు చేసుకున్నారు.
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కూడా ఇక్కడి నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆయన సొంత ఊరు తెల్దారు పల్లి ఇదే నియోజకవర్గం పరిధిలో ఉండడంతో పోటీకి ఆసక్తి చూపుతున్నారు. సీపీఎంలో సొంత నిర్ణయాలు ఉండవు కాబట్టి పార్టీ కార్యదర్శి వర్గం సమావేశంలో తన అభిప్రాయం చెప్పినట్లు సమాచారం.
అలాగే, బీఆర్‌ఎస్ నుంచి పోటీకి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా రెడీగా ఉన్నారు. ఆయన్ను రాష్ట్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని వార్తలు వస్తున్న నేపథ్యం లో మంత్రి పదవితోపాటు పాలేరు శాసనసభ స్థానాన్ని కూడా డిమాండ్ చేసే అవకాశం ఉంది.గతంలో పాలేరు నుంచి ఎమ్మెల్యేగా ఉన్న ఆయన అదే నియోజకవర్గంపై దృష్టి సారించారు. అక్కడైతేనే పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. జిల్లాలో బీఆర్‌ఎస్‌ను బలోపేతం చేసుకునేందుకు తుమ్మలకు కీలక బాధ్యతలతో పాటు వచ్చే ఎన్నికల్లో తుమ్మల అభ్యర్థిత్వానికి సీఎం సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. తమ్మినేని కూడా ఇదే నియోజకవర్గాన్ని పొత్తుల్లో భాగంగా తమ పార్టీకి కేటాయించాలని కోరే అవకాశమున్నందున అధికార బీఆర్‌ఎస్‌కు టికెట్ కేటాయింపు సంకటంగా మారే పరిస్థితి ఉంది. పాలేరు సెగ్మెంట్ పూర్వపరాలను పరిశీలిస్తే, 2009,2014 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున రాంరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేసి గెలుపొందారు. ఆయన చనిపోవడంతో 2016లో ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా ఆయన సతీమణి రామిరెడ్డి సుచరిత పోటీ చేశారు. సుచరితపై బీఆర్‌ఎస్ అభ్యర్థిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు గెలిచారు. ఆ తర్వాత 2018 లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కందాల ఉపేందర్ రెడ్డి చేతిలో తుమ్మల ఓడిపోయారు. ఓటమి తర్వాతా ఆయన రాజకీయాలకు కొంత దూరంగా ఉన్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన కొన్ని రోజుల తర్వాత ఉపేందర్ రెడ్డి బీఆర్‌ఎస్‌లో చేరారు. గత మూడు దశాబ్దాల రాజకీయ పరిస్థులను పరిశీలిస్తే ఈ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, టీడీపీ, బీఆర్‌ఎస్, సీపీఎం అభ్యర్థులను గెలిపించిన చరిత్ర ఈ నియోజకవర్గ ప్రజలకు ఉంది.