ప్రపంచంలో కొన్ని కీలక దేశాల అధినేతలంతా ఒకచోటకు చేరారు. ఉజ్బెకిస్థాన్‌లోని సమర్కండ్లో మరి కొన్ని గంటల్లో ప్రారంభంకానున్న షాంఘై సహకార సంస్థ(Shanghai Cooperation Organization (SCO)) శిఖరాగ్ర సదస్సులో వీరంతా ఒకే వేదికపై కలుసుకోనున్నారు. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో రెండేళ్ల తర్వాత షాంఘై సహకార సంస్థలో సభ్య దేశాల నేతలు ముఖాముఖి భేటీ కానుండడం ఇదే తొలిసారి. రెండు రోజుల పాటు జరిగే ఈ సమావేశాల్లో ప్రాంతీయ, అంతర్జాతీయ సమస్యలు చర్చకు రానున్నాయి.
– డిజిటల్ మీడియా, ఆంధ్రప్రభ
2001లో ప్రారంభమైన షాంఘై సహకార సంస్థ (SCO)లో చైనా, కజక్‌స్థాన్, కిర్గిజిస్థాన్, రష్యా, తజికిస్థాన్, ఉజ్బెకిస్థాన్, భారత్, పాకిస్థాన్‌కు పూర్తిస్థాయి సభ్యత్వం ఉంది. భారత్, పాకిస్తాన్ 2017లో సభ్యులయ్యాయి. ఇక.. SCOలో పరిశీలక దేశాలుగా ఆఫ్గానిస్థాన్, బెలారస్, మంగోలియా కొనసాగుతున్నాయి. కంబోడియా, నేపాల్, శ్రీలంక, తుర్కియే, ఆర్మేనియా, అజర్బైజాన్ దేశాలు కూడా చర్చల్లో భాగస్వామ్య హోదాను కలిగి ఉన్నాయి. ఈ సమావేశాల్లో వివిధ అంశాలపై జరిగే చర్చలు ఒక ఎత్తైతే.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏయే దేశాల అధినేతలతో ప్రత్యేకంగా సమావేశమై.. ద్వైపాక్షిక చర్చలు జరుపుతారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్‌గా మారింది.
కాగా, ఒకవైపు భారత్, చైనా మధ్య సరిహద్దు ప్రాంతాల్లో నెలకొన్న ఘర్షణ వాతావరణం. అలాగే తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద పెట్రోలింగ్ పాయింట్-15 నుంచి భారత, చైనా బలగాలు వెనక్కి మళ్లిన నేపథ్యంలో ఈ రెండు దేశాల మధ్య నెలకొన్న ప్రతిష్టంభన కొంత వరకు సడలినట్టుగానే అనిపిస్తోంది. ఈనేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ తో భారత ప్రధాని మోదీ భేటీ అవుతారా.. ఒకవేళ అదే జరిగితే ఏయే అంశాలపై చర్చిస్తారనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.ఈ ఇద్దరు నేతల భేటీపై ఇప్పటి దాకా అయితే ఎట్లాంటి అధికారిక ప్రకటన విడుదల కాలేదు.
ఇక.. షాంఘై సహకార సంస్థ (SCO) సదస్సులో పాల్గొనే పలు అగ్రనేతలు ద్వైపాక్షిక చర్చలు జరిపే చాన్సెస్ ఉన్నాయి. భారత్, -పాక్, భారత్, -చైనా నేతల మధ్య ఈ సందర్భంగా చర్చలు జరిగే అవకాశం ఉంటుందా? లేదా అన్న విషయం మాత్రం స్పష్టంగా తెలియడం లేదు. ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ మధ్య చర్చలు జరుగుతాయని ఓ అధికారిక ప్రకటన వెలువడింది. వ్యూహాత్మక స్థిరత్వం, ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ప్రస్తుత పరిస్థితులు, ఐక్యరాజ్య సమితి, జి-20లో ఇరు దేశాల మధ్య పరస్పర సహకారం వంటి అంశాలు వీరి మధ్య చర్చకు వచ్చే అవకాశం ఉంది.
ఇక.. డిసెంబరులో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి, 2023లో జీ-20, SCOకు భారత్ అధ్యక్షత వహించనున్న నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఎంతో కీలకం కానుంది. అట్లనే ఇరాన్ అధినేతతోనూ ప్రధాని మోదీ ద్వైపాకిక సమావేశంలో పాల్గొననున్నారు. SCO సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ పాల్గొనడంపై నెలకొన్న సందేహాలు తొలగిపోయాయి. కజక్‌స్థాన్ పర్యటనలో ఉన్న జిన్‌పింగ్ అటు నుంచి ఉజ్బెకిస్థాన్‌కు వస్తున్నట్లు స్వయంగా వెల్లడించారు. భారత ప్రధాని నరేంద్రమోదీతో పాటు పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్ ఒకే వేదికను పంచుకోనుండడం ఈ శిఖరాగ్ర సదస్సు ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.