Tuesday, November 26, 2024

కర్నాటకను చూసొచ్చి సిగ్గు తెచ్చుకో.. బండి సంజ‌య్‌పై కేటీఆర్‌ ఫైర్‌

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మండిపడ్డారు. ఈ నెల 27న మాదాపూర్‌ హెచ్‌ఐసీసీలో టీఆర్‌ఎస్‌ ప్లీనరి సమావేశం జరుగనున్న నేపథ్యంలో ఏర్పాట్లపై రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లాల నేతలతో పాటు మంత్రులతో కేటీఆర్‌ సమావేశమై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. టీఆర్‌ఎస్‌ పార్టీ పాదయాత్రలను అడ్డుకునే కుట్ర చేస్తుందని బండి సంజ‌య్ చేసిన వ్యాఖ్యలను పలువురు కేటీఆర్‌ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. బండి సంజయ్‌ గద్వాల, వనపర్తి జిల్లాలోనే పాదయాత్ర చేస్తున్నారని, పక్కనే పది కిలోమీటర్లు దాటి వెళ్తే కర్నాటక రాయ్‌చూర్‌ జిల్లా ఉందని, అవసరమైతే కార్లు ఏర్పాటు చేస్తామన్నారు. అక్కడికి వెళ్లి బీజేపీ పాలన గురించి అడిగి తెలుసుకోవాలన్నారు.

కర్నాటకలోని రాయ్‌చూర్‌, యాదగిరి, బీదర్‌ జిల్లాలో గానీ తెలంగాణలో ఇస్తున్నట్లు 24 గంటల కరెంటు, ఇంటింటికీ నీళ్లు, రైతుబంధు, రైతుబీమా, తెలంగాణలో ఇస్తున్న తరహాలో పింఛన్లు వస్తున్నాయా? చూడాలన్నారు. కర్నాటకలో పనులకు 40శాతం మంత్రులకు కమీషన్లు ఇవ్వాల్సి వస్తుందని కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. గుజరాత్‌లో ఇవాళ కరెంటు కావాలని రైతులు రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నారని.. ఇక్కడ బండి సంజయ్‌ ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. రాయ్‌చూర్‌ బీజేపీ ఎమ్మెల్యే తెలంగాణలో పాలన, సంక్షేమం బాగుందని.. మమ్మల్ని తీసుకెళ్లి తెలంగాణలో కలపమంటున్నానంటూ విజ్ఞప్తి చేస్తున్నట్లు గుర్తు చేశారు. పాదయాతను అడ్డుకునే ఖర్మ మాకు లేదని.. కావాలంటే పక్కకున్న కర్నాటక వెళ్లి చూసిరా.. అక్కడ బీజేపీ ఎలా ఉందో ?.. ఇక్కడ ఎలా ఉందో చూసి సిగ్గు తెచ్చుకో అంటూ మండిపడ్డారు.

ఏం మొఖం పెట్టుకొని పాదయాత్రలు చేస్తున్నవ్‌?
బండి సంజయ్‌ ఏం మొఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నాడని కేటీఆర్‌ ప్రశ్నించారు. ‘పాలమూరు ఎత్తిపోత పథకానికి జాతీయ హోదా ఇవ్వం.. పక్కనే ఉన్న అప్పర్‌ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇస్తాం’ అని సిగ్గులేకుండా చెప్పుకు తిరుగుతున్నావా?.. పక్కనే ఉన్న కర్నాటక ప్రభుత్వానికి మాత్రం వేల కోట్లు ఇచ్చి సహకరిస్తాం, ఇక్కడ నీతి ఆయోగ్‌ చెప్పినా ఒక్క పైసా ఇవ్వమని చెప్పి తిరుగుతున్నావా?.. కృష్ణా నది మీద కృష్ణా రివర్‌ బోర్డ్‌ అనే శిఖండి సంస్థను తెచ్చి పాలమూరు ఎత్తిపోతల పథకానికి అనుమతులు ఇవ్వకుండా, నదీ జలాల వాటా తేల్చకుండా ఏడేళ్ల నుంచి కేంద్రం తాత్సారం చేస్తున్నందుకా ?.. పాలమూరులోని వెనుకబడిన అలంపూర్‌ నుంచి మాచర్ల దాకా నాగర్‌ కర్నూల్‌ మీదుగా రైలు లైన్‌ మంజూరు చేయలేదు.. రైల్వే ప్రాజెక్టుల్లో తెలంగాణకు అన్యాయం చేసినం.. అయినా సిగ్గు లేకుండా యాత్రలు చేస్తమని తిరుగుతున్నవా? అంటూ ధ్వజమెత్తారు.

ఏం మొఖం పెట్టుకొని తిరుగుతున్నావని.. పాలమూరుకు చేసిందేందని ప్రశ్నించారు. ఇవాళ మొత్తం ప్రతి గ్రామంలో పథకాలు మావే.. ప్రతి గ్రామం మా మోదీ పైసలే ఉన్నాయని చెబుతున్నాడన్నారు. ఇదే నిజమైతే నేను సవాల్‌ చేస్తున్నా.. బండి సంజయ్‌ చెప్పిన మాట నిజమే అయితే.. పక్కన కర్నాటకనే ఉందని, ఎక్కడ ఎందుకు లేవని ప్రశ్నించారు. అక్కడి గ్రామాల్లో వైకుంఠ ధామాలు, నర్సరీలు, ఊరూరా హరితహారం లేదని, ఇంటింటికీ నల్లాలు లేవని, రైతుబంధు, రైతుబీమా పథకాలు ఎందుకు లేవన్నారు. బండి చెప్పే మాటలన్నీ అసత్యాలేనని ప్రజలకు తెలుసునన్నారు.

సొల్లు పురాణం నమ్మేందుకు ప్రజలు సిద్ధంగా లేరు
జోగులాంబ ఆలయం వద్ద నుంచే పాదయాత్ర ప్రారంభించాడని, జోగులాంబ ఆలయానికి నీ ప్రభుత్వం నాలుగు పైసలు ఇచ్చిందా? అని ప్రశ్నించారు. వేములవాడ ఆలయానికి ఇచ్చారా? జోగులాంబ ఆలయానికి ఇచ్చారా? అని ప్రశ్నించారు. తెల్లారి లేస్తే రాముడు రాముడు అంటారనీ.. మరి భద్రాద్రి రాముడికి ఇచ్చారా? కేంద్ర ప్రభుత్వం ఎవరికి ఇచ్చిందని మండిపడ్డారు. ఇకనైనా పనికిమాలిన అపసవ్యపు కూతలు మానాలని హితవు పలికి, ప్రజలకు ఏం చేశారో చెప్పాలన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం అంటున్నారని.. కేంద్రంలో ఉన్నది బీజేపీయేనని.. దేశవ్యాప్తంగా ఉచితంగా విద్య, వైద్యం అందిస్తానంటే ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. దేశవ్యాప్తంగా ఉచిత విద్య, వైద్యం అందించాలని, ప్రైవేటు హాస్పిటళ్లు, విద్యా సంస్థలను ఎత్తివేద్దామని.. దమ్ముంటే మోదీకి చెప్పి చట్టం చేసి పాస్‌ చేయించాలని, తాము మద్దతిస్తామన్నారు. బండి డొల్లమాటలు, సొల్లు పురాణం నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరని, తప్పకుండా తగిన రీతిలో బుద్ధి చెబుతారని కేటీఆర్‌ స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement