నదీజలాల సమస్యలకు పరిష్కారాన్ని అన్వేషించాలని దక్షిణాది రాష్ట్రాలను కేంద్ర హోంమంత్రి అమిత్ షా కోరారు. శనివారం జరిగిన దక్షిణాది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు, లెఫ్టినెంట్ గవర్నర్‌లు హాజరైన 30వ దక్షిణ జోనల్ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలను కోరినట్లు అధికారిక ప్రకటన వెలువడింది.
జలాల పంపకానికి సంబంధించిన సమస్యలకు ఉమ్మడి పరిష్కారాన్ని అన్వేషించాలని దక్షిణ జోనల్ కౌన్సిల్‌లోని అన్ని రాష్ట్రాలకు కేంద్ర హోంమంత్రి పిలుపునిచ్చారు. దక్షిణాదిలోని అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలలో తమిళనాడు, కర్నాటక మధ్య కావేరి సమస్య.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య కృష్ణా నదీ జలాల భాగస్వామ్య వివాదం ఉన్నాయి.
తిరువనంతపురంలో ఈరోజు (శనివారం) జరిగిన సదరన్ జోనల్ కౌన్సిల్ 30వ సమావేశంలో మొత్తం 26అంశాలు చర్చించారు. వీటిలో 9 సమస్యలను పరిష్కారించారు. మరో 17 అంశాలు తదుపరి పరిశీలన కోసం రిజర్వ్ చేశారు. వీటిలో 9 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణకు సంబంధించినవి అని అధికారులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తమ పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరస్పరం పరిష్కరించుకోవాలని అమిత్ షా ఈ సందర్భంగా కోరారు.