ఓ మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో పోక్సో చట్టం కింద కేసు నమోదుకాగా, నిందితుడికి న్యాయస్థానం 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అదేవిధంగా దోషికి రూ.50వేల జరిమానా కూడా విధించింది. 2020లో మైనర్ బాలికపై ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ కేసుకు సంబంధించి న్యాయస్థానం తీర్పును వెల్లడించింది. వికారాబాద్ జిల్లాకు చెందిన మహిపాల్ రెడ్డికి మేడ్చల్ లోని పోక్సో చట్టం ప్రత్యేక కోర్టు 20 ఏళ్ల జైలు శిక్ష విధించిందని అధికారులు తెలిపారు.
మహిపాల్ రెడ్డి తన సోదరి ఇంటికి వెళ్లగా వీధిలో స్నేహితులతో కలిసి ఆడుకుంటున్న బాలికను చూశాడు. తల్లిదండ్రులు ఇంట్లో లేరని తెలుసుకున్న అతడు బాలికకు చాక్లెట్లు ఇస్తానని నమ్మబలికి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఆ బాలికి తల్లిదండ్రులు వచ్చి చూడగా కనిపించలేదు. వెంటనే వెతకడం ప్రారంభించారు. మహిపాల్ రెడ్డి బాలికపై లైంగిక దాడి చేశాడని తెలుసుకుని షాక్ కు గురైన వారు అతడిని చితకబాది పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిపై ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.