ఢిల్లీ ఆర్టీవో నుంచి జారీ అయిన ‘SEX’ అనే వెహికల్ నెంబర్ సిరీస్ వివాదాస్పదం అవుతోంది. ఈ నెంబర్ సిరీస్ కారణంగా చాలామంది ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మహిళలకు పోకిరీల నుంచి అసభ్యకరమైన కామెంట్స్ ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఓ యువతి ఢిల్లీ మహిళా కమిషన్కు కంప్లెయింట్ చేసింది. దీనికి స్పందించిన విమెన్ కమిషన్ సదరు ఆర్టీవో అధికారులకు నోటీసులు జారీ చేసింది.
ఢిల్లీ ఆర్టీవో కేటాయించిన నెంబర్ సిరీస్లో S,E,X అనే అల్ఫాబెట్స్ వరుస క్రమంలో ఉండటంతో తీవ్ర వేధింపులకు గురవుతున్నానని ఆ యువతి మహిళా కమిషన్కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. స్కూటీపై బయటకు వెళ్లినప్పుడల్లా ఆకతాయిలు తనపై జోక్స్, సెటైర్స్ వేస్తున్నారని… ఈ కారణంగా అత్యవసర పనులకు కూడా స్కూటీపై వెళ్లలేని పరిస్థితిని ఎదుర్కొంటున్నానని తెలిపింది.
యువతి కంప్లెయింట్కు స్పందించిన ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్.. ఢిల్లీ రవాణా శాఖకు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల్లోగా ఆ యువతి స్కూటీకి కేటాయించిన నెంబర్ సిరీస్ను మార్చాలని ఆదేశించారు. ఇప్పటివరకూ ఈ సిరీస్ కింద ఎన్ని వాహనాలు రిజిస్టర్ అయ్యాయో… వాటి వివరాలు తమకు సమర్పించాలన్నారు. అలాగే ఈ నెంబర్ సిరీస్ విషయంలో ఇప్పటివరకూ వ్యక్తమైన అభ్యంతరాలు, తీసుకున్న చర్యలపై నాలుగు రోజుల్లోగా సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించారు.
లోకల్ టు గ్లోబల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్బుక్, ట్విట్టర్ పేజీలను ఫాలో అవ్వండి..