Friday, November 22, 2024

పానీ పరేషానీ: సిటీ శివార్లలో తీవ్ర నీటి ఎద్దడి.. జలమండలి సరఫరా అంతంతే

శివారు ప్రాంతాలను జ‌ల‌మండ‌లి విస్మ‌రిస్తోంది. పెరుగుతున్న ప్రాంతాలకు అనుగుణంగా నీటిసరఫరా కావడం లేదు.. నీళ్ల కోసం ప్రజలు నానాతంటాలు పడుతున్నారు.. ముఖ్యంగా సమ్మర్‌ వచ్చిందంటే చాలు శివారు ప్రాంతాల్లో ఇళ్ల యజమానుల గుండెళ్లో రైళ్లు పరుగెడతాయి.. ప్రతిసారి వేసవి నీటి కష్టాలు తప్పడం లేదు.. శివార్లలో నీటిసరఫరా క్రమబద్ధీకరించేందుకు పెద్దఎత్తున నిధులు ఖ‌ర్చు చేసినా ఆ ప్రాంతాల్లో నీటి కష్టాలు తీరడం లేదు.. భూగర్భజలాలు తగ్గడంతో బోర్లు అంతంత మాత్రంగానే నీళ్లు అందిస్తున్నాయి.. దీంతో ప్రైవేట్‌ ట్యాంకర్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి… జలమండలి నీళ్లు స‌ర‌ఫ‌రా చేస్తున్న అవి ఐదురోజులకొకసారి రావ‌డంతో ప్ర‌జ‌ల‌కు ఇబ్బందులు తప్పడం లేదు.

(ప్రభన్యూస్‌బ్యూరో ఉమ్మడిరంగారెడ్డి) : రంగారెడ్డి జిల్లా పరిధిలోని శివారు ప్రాంతాలు రోజురోజుకు విస్తరిస్తున్నాయి. చుట్టూరా ఎటుచూసినా 50కిలోమీటర్ల పరిధిలో శివారు ప్రాంతాలు విస్తరించాయి. కొత్తకొత్త కాలనీలు వెలుస్తున్నాయి…శివార్లలో ధరలు కాస్త అందుబాటులో ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలు ప్లాట్లు కొనుగోలు చేసిఇళ్లు కట్టుకుంటున్నారు. కొందరు అపార్టుమెంట్లలో కొనుగోలు చేస్తున్నారు. శివారు విస్తరిస్తున్నట్లుగా జలమండలి నీటిసరఫరాను విస్తరింపజేయడం లేదు. ప్రతిసారి వేసవిలో వచ్చే సంవత్సరం సమస్య ఉండదని తేల్చి చెబుతున్నారు. వేసవి రాగానే పరిస్థితులు మామూలే అన్నట్లుగా మారింది. రంగారెడ్డి జిల్లా పరిధిలోని శివారు గ్రామ పంచాయతీలను మునిసిపాలిటీలుగా కార్పొరేషన్లుగా చేశారు. రెRండేళ్ల క్రితం వీటికి ఎన్నికలు కూడా నిర్వహించారు. జిల్లా పరిధిలో బండ్లగూడజాగీర్‌, మీర్‌పేట, బడంగ్‌పేట కార్పొరేషన్లు ఏర్పాటు చేయగా నార్సింగి, మణికొండ, శంషాబాద్‌, కొత్తూరు, షాద్‌నగర్‌, ఆమన్‌గల్‌, ఇబ్రహీంపట్నం, తుర్కయంజాల్‌, జల్‌పల్లి, తుక్కుగూడ మునిసిపాలిటీలు ఉన్నాయి. కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో అన్నింట్లో నీటి సమస్యలు నెలకొన్నాయి. వేసవి ఎండలు ముదురుతుండటంతో నీటి మట్టం తగ్గడంతో బోర్లు పూర్తి స్థాయిలో నీటి సరఫరా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో నీళ్లకోసం ప్రజలు పడరానిపాట్లు పడుతున్నారు. ఐదురోజులకొకసారి నీటిసరఫరా చేస్తుండటంతో ఇబ్బందులు తప్పడం లేదు. కేవలం గంటపాటు మాత్రమే నీటిసరఫరా చేస్తున్నారు. కొన్నిసార్లు వారానికి ఒకసారి కూడా నీటిసరఫరా సక్రమంగా చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి.

ట్యాంకర్ల కోసం వెతుకులాట..
శివార్లకు జలమండలి నీటిసరఫరా చేస్తున్నా పూర్తి స్థాయిలో మాత్రం పంపిణీ చేయలేకపోతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో జలమండలి వాటర్‌ట్యాంకుల నీటిని సరఫరా చేస్తున్నారు. కానీ శివారు కార్పొరేషన్లు, మునిసిపాలిటీల పరిధిలో మాత్రం ఇంకా ప్రారంభించలేదు. జలమండలి సరఫరా చేసే ట్యాంకర్ల ధర తక్కువగా ఉండటంతో సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రైవేట్‌ ట్యాంకర్ల యజమానులు ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నారు. 12 వేల లీటర్ల ట్యాంకర్లు రూ. 2వేల చొప్పున వసూలు చేస్తున్నారు. శివార్లలో చాలామంది అద్దెలు వచ్చేలా ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వేసవి కాలంలో శివార్ల పరిధిలో సగానికి పైగా బోర్లు ఎండిపోతాయి. ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు ఉంటాయి. చాలా డబ్బులు నీటికే సరిపోతుండటంతో ఇంటి యజమానులు ఆందోళన చెంబుతున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఒకరకంగా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో మరో రకంగా జలమండలి నీటి సరఫరా చేస్తోంది. శివారు ప్రాంతాల్లో కూడా ట్యాంకర్ల ద్వారా నీటిసరఫరా చేస్తే చాలామందికి ప్రయోజనకరంగా ఉంటుంది.

కొనసాగుతున్న పనులు..
అవుటర్‌ రింగ్‌రోడ్డు లోపల ఉన్న ప్రాంతాలకు సరియైన పద్దతిలో నీటిసరఫరా చేసేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున నిధులు మంజూరు చేసింది. ఫేజ్‌ 1, ఫేజ్‌2 కింద ఏకంగా రూ. 1200కోట్లు మంజూరు చేసింది. ఫేజ్‌ 1 కింద 65.5 ఎంఎల్‌ సామర్థ్యం కలిగిన 34 రిజర్వాయర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో 1571 కిలోమీటర్ల మేర కొత్త పైప్‌లైన్‌ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ నిర్మాణ పనులు పూర్తి చేస్తే 88వేల ఇళ్లకు నల్లా కనెక్షన్లు వచ్చే అవకాశాలున్నాయి. ఘట్‌కేసర్‌, కీసర, సరూర్‌నగర్‌, మహేశ్వరం, శంషాబాద్‌, హయత్‌నగర్‌, ఇబ్రహీంపట్నం మండలాల పరిధిలో ప్యాకేజీ1 పనులు కొనసాగుతున్నాయి. పైప్‌లైన్ల నిర్మాణాలు పూర్తి చేసి ఏప్రిల్‌ మొదటివారంలో నీటిసరఫరా చేయాలని నిర్ణయించినా అది అమలు కావడం లేదు. ప్రతిసారి శివార్లలో నీటి కష్టాలు తీరతాయని ఆశపడటం తరువాత నిరాశ చెందడం మామూలైపోయింది. ఫేజ్‌2 పరిస్థితి కూడా అంతే. ఫేజ్‌ 1 ప్యాకేజీ లో రూ. 613కోట్లు..ఫేజ్‌2లో రూ. 587కోట్లతో పనులు జరుగుతున్నాయి. ఫేజ్‌ 2 ప్యాకేజీలో 71.5 మిలియన్‌ లీటర్ల సామర్థ్యంతో 38 రిజర్వాయర్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఏప్రిల్‌ మాసంలో నీటిసరఫరా చేయాలని నిర్ణయించినా అది అమలు కావడం లేదు. ఏప్రిల్‌ మాసంలోనే నీటి కష్టాలు రెట్టింపు అయ్యాయి. రానున్న మే మాసంలో పరిస్థితులు తీవ్రంగా ఉండే ప్రమాదం లేకపోలేదు. ఎండలు ముదురుతుండటంతో బోర్లు ఎండిపోతున్నాయి. దీంతో ఎక్కువ డబ్బులు కర్చు చేసి ప్రైవేట్‌ ట్యాంకర్లను వినియోగించుకోవల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. వేసవి కాలాన్ని దృష్టిలోపెట్టుకుని పూర్తి స్థాయిలో నీటిసరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement