దేశంలో రోజురోజుకీ పెరుగుతున్న కరోనా కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ కరోనా కేసులు పెరుగుతుండడం కలకలం రేపుతోంది. కరోనా మహమ్మారిని అడ్డుకునేందకు టీకాలు అందుబాటులోకి వచ్చాయి. ప్రపంచ వ్యాప్తంగా పలు రకాల టీకాలు అందుబాటులోకి రాగా భారత్.. ప్రముఖంగా రెండు రకాల టీకాలు వినియోగంలోకి వచ్చాయి. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతోంది. దశల వారీగా దేశ ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ను అందిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి 45 ఏళ్ల పైబడిన వారందరూ వ్యాక్సిన్ వేయించుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. ప్రస్తుతం కోవిషీల్డు, కోవాగ్జిన్ టీకాలు అందుబాటులో ఉన్నాయి. తాజాగా భారత్లో మరో టీకా అందుబాటులోకి రానుంది.
అమెరికా ఔషధ తయారీ సంస్థ నోవావాక్స్ రూపొందించిన కొవావాక్స్ టీకా క్లినికల్ ట్రయల్స్ ను భారత్ లో తమ సంస్థ ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా తెలిపారు. ఈ ఏడాది సెప్టెంబర్ నాటికి ఈ టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. అమెరికా ఫార్మా సంస్థ నోవావ్యాక్స్ తో ఎస్ఐఐ కలిసి ఈ టీకాను అభివృద్ధి చేస్తోందని పూనావాలా చెప్పారు. భారత్ సహా పేద, మధ్యాదాయ దేశాల్లో సరఫరా చేయడానికి నోవా వాక్స్ తో సీరం ఒప్పందం చేసుకుందని వెల్లడించారు. కొత్త రకాలైన ఆఫ్రికా, యూకే వేరియంట్లపైనా ఈ టీకాను పరీక్షించారని తెలిపారు. మొత్తంగా 89 శాతం సమర్థతను కలిగి ఉన్నట్టు తేలిందని వివరించారు. ఈ టీకాపై యూకేలో ట్రయల్స్ జరిగాయన్నారు.
కాగా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రా జెనెకాలతో భాగస్వామ్యాన్ని ఏర్పరుచుకున్న సీరం ఇప్పటికే కొవిషీల్డ్ టీకాను భారత్లో పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలకూ ప్రభుత్వం ఈ వ్యాక్సిన్లను ఎగుమతి చేస్తోంది.