తమకు జీతాలు ఇవ్వడం లేదు, స్టైఫండ్ ఇవ్వడం లేదు.. చిన్న చిన్న అవసరాలకు కూడా బంధువుల నుంచి అప్పుగా తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. తమకు పెండింగ్‌లో ఉన్న స్టైఫండ్, పెండింగ్ సాలరీస్ చెల్లించాలని రెసిడెంట్ డాక్టర్లు ఆందోళనకు దిగారు. రెండ్రోజులుగా హైదరాబాద్లోని పలు ఆస్పత్రుల వద్ద ప్లకార్డులతో వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణలోని 28 ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న దాదాపు 690 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు రాష్ట్ర ప్రభుత్వానికి పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్, చెల్లించని జీతాలపై బుధవారం సమ్మెకు దిగారు. రెసిడెంట్ డాక్టర్లు తెలిపిన వివరాల ప్రకారం.. వారు పోస్ట్-గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత నవంబర్ 2021లో ఒక సంవత్సరం తప్పనిసరి సేవలో చేరారు. ప్రతి సంవత్సరం ఒక బ్యాచ్ గ్రాడ్యుయేట్లు ప్రభుత్వ కళాశాలలు, ఆసుపత్రులలో నెలవారీ జీతంతో చేరారు. వీరిలో చాలా మందికి మూడు నుంచి -ఐదు నెలలుగా ఉపకార వేతనాలు అందడం లేదు. మరికొందరికి ఏడు నెలల క్రితం చేరినప్పటి నుండి స్టైఫండ్స్ రావడం లేదు.
ఒక రెసిడెంట్ డాక్టర్ మాట్లాడుతూ.. తాము కుటుంబం, స్నేహితుల నుండి డబ్బు అప్పుగా తీసుకోవడం నిజంగా దురదృష్టకరం. మేము వారికి ఏమి చెప్పాలి? మాకు జీతం ఇవ్వడం లేదు? చాలా కష్టపడి పని చేస్తున్నాం. మాకు మా బకాయిలు కావాలి ” అన్నారు. జూన్ 28న తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్‌ఆర్‌డీఏ) ఎలక్టివ్ సర్వీసెస్, ఔట్ పేషెంట్, వార్డులను బహిష్కరించి నిరసనలు చేపట్టాలని సమ్మె నోటీసు జారీ చేసినా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరింది.
ఇక.. సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి చెందిన 11 మంది రెసిడెంట్ వైద్యులు మంగళవారం ఈ సమస్యపై నిరసన తెలిపారు. తమకు రావాల్సిన బకాయిలు చెల్లించాలని కోరుతూ రెసిడెంట్ వైద్యులతో కలిసి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ కార్యాలయం ఎదుట నిరసన చేపట్టారు. 2021 నవంబర్‌లో నిజామాబాద్, మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, సిద్దిపేట, సంగారెడ్డి తదితర ప్రభుత్వ వైద్య కళాశాలల్లో వైద్యులను నియమించారు. ఉస్మానియా మెడికల్ కాలేజీ పరిధిలోని నీలోఫర్ హాస్పిటల్, ఉస్మానియా జనరల్ హాస్పిటల్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి (SDEH), ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ (IMH) మరియు ఇతర ఆసుపత్రులలో వీరిని నియమించారు. ఐఎంహెచ్, ఎస్‌డిఇహెచ్ వైద్యులకు గత ఏడు నెలలుగా వేతనాలు అందడం లేదు.