Wednesday, November 20, 2024

కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత

తెలంగాణ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి ఎం. సత్యనారాయణరావు(ఎమ్మెస్సార్‌) కన్నుమూశారు. ఆయన వయసు 87 సంవత్సరాలు. కొవిడ్‌ బారిన పడిన ఆయన నిమ్స్‌ లో చికిత్స పొందుతూ ఈ రోజు తెల్లవారుజామున 3.45 గంటలకు తుదిశ్వాస విడిచారు. కరోనా బారిన పడిన ఎమ్మెస్సార్ ను కుటుంబ సభ్యులు ఆదివారం చికిత్స కోసం నిమ్స్‌ కు నిమ్స్‌లో చేర్చారు. అక్కడ ఆయనను వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. అయినప్పటికీ ఆరోగ్యం కుదుటపడకపోవడమే కాకుండా మరింత క్షీణించింది. దీంతో ఈ తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచారు.

ఎమ్మెస్సార్ మృతి పట్ల ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ వాదిగా, ఎంపీగా, ఉమ్మడి రాష్ట్రంలో మంత్రిగా, ఆర్టీసీ చైర్మన్‌ గా  ఎంఎస్‌ఆర్ ప్రత్యేక శైలి కనబరిచారని, రాజకీయాల్లో ముక్కుసూటి మనిషిగా పేరొందారని సీఎం గుర్తు చేసుకున్నారు. ఎంఎస్‌ఆర్ కుటుంబసభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు సైతం ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఎమ్మెస్సార్ ఆర్టీసీ చైర్మన్‌గా, దేవాదాయశాఖ మంత్రిగా పనిచేశారు. ఎమ్మెస్సార్‌ 1934 జనవరి 14న కరీంనగర్ లో జన్మించారు. 1954 నుంచి 1969 వరకు విద్యార్థి, యువజన నాయకుడిగా పనిచేశారు. 1969 ప్రత్యేక తెలంగాణ పోరాటంలో కీలకపాత్ర పోషించారు. 1971లో తెలంగాణ ప్రజా సమితి తరఫున కరీంనగర్‌ నుంచి లోక్‌ సభకు ఎన్నికయ్యారు. టీపీఎఫ్‌ విలీనంతో కాంగ్రెస్‌ లోకి చేరారు. 1980 నుంచి 1983 వరకు అఖిల భారత కాంగ్రెస్‌ కమిటీ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. 1985 నుంచి 1988 వరకు సుప్రీం కోర్టులో సీనియర్‌ కౌన్సిల్‌ గా పనిచేశారు. 1990 నుంచి 94 వరకు ఏపీఎస్‌ఆర్టీసీ ఛైర్మన్‌ గానూ బాధ్యతలు నిర్వర్తించారు. 2000 సంవత్సరం నుంచి 2004 వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారు. అనంతరం వైఎస్ ప్రభుత్వంలో దేవాదాయ, క్రీడ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రిగా పనిచేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement