చిన్న చిన్న వార్తలు, కబుర్లు, వీడియోలు మోసుకొచ్చే బుల్లిపిట్ట ట్విట్టర్ చేతులు మారనున్నదా.. ప్రపంచంలోనే అతిపెద్ద కుబేరుడు ఎలన్‌మస్క్ దాన్ని టేకోవర్ చేయాలని ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే అంటున్నారు పరిశీలకులు. ట్విట్టర్‌ను టేకోవర్ చేయడానికి ఎలన్‌మస్క్ గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ట్విట్టర్ షేర్‌పై 54.20 డాలర్లు చెల్లించడానికి తాను సిద్ధమని మస్క్ తెలిపారు.
గత జనవరి 28న ట్రేడింగ్ ముగింపు ధర ప్రకారం 54 శాతం వాటా కొనుగోలు చేస్తామని ఆయన ప్రతిపాదించారు. ఈ మొత్తం విలువ 43 బిలియన్ డాలర్లు ఉంటుంది. ట్విట్టర్ టేకోవర్ చేసుకోవడానికి ఎలన్‌మస్క్ బెస్ట్ అండ్ ఫైనల్
ఆఫర్ ప్రతిపాదించిన వార్త ఒకటి వెలుగులోకి రావడంతో ట్విట్టర్ షేర్ 18శాతం దూసుకెళ్లింది. ప్రీ మార్కెట్ ట్రేడింగ్‌లోనూ 12 శాతం లాభంతో ట్రేడ్ అయ్యింది.
ఇక.. ట్విట్టర్ పనితీరుపై ఆ సంస్థ చైర్మన్ బ్రెట్ టేయ్లర్‌కు ఎలన్‌మస్క్ లేఖ రాశారు. ప్రస్తుత రూపంలో ట్విట్టర్ అభివృద్ధి చెందలేదని, సామాజిక అవసరాలను తీర్చలేదని గ్రహించానని ఆయన పేర్కొన్నారు. ట్విట్టర్ ఒక ప్రైవేట్ కంపెనీగా పరివర్తన చెందాల్సిన అవసరం ఉందన్నారు. ఒకవేళ తన ఉత్తమ-తుది ఆఫర్‌ను ఆమోదించకపోతే ట్విట్టర్‌లో వాటాదారుగా తన స్థానం గురించి పునః పరిశీలించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. ఈ మేరకు గురువారం యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఫైలింగ్‌లో మస్క్ తన ఆఫర్ గురించి తెలిపారు.
ఈ నెల నాలుగో తేదీన ట్విట్టర్‌లో 9 శాతం వాటాలను ఎలన్‌మస్క్ కొనుగోలు చేసినట్లు వార్తలు బయటకు వచ్చాయి.దీంతో ట్విట్టర్‌లో అతిపెద్ద వాటాదారుగా ఆయన నిలిచారు. అత్యధిక వాటా కొనుగోలు చేసినందుకు ఎలన్‌మస్క్‌ను డైరెక్టర్‌గా నియమిస్తున్నట్లు ట్విట్టర్ ప్రకటించింది. కానీ ట్విట్టర్ డైరెక్టర్ బోర్డులో చేరడానికి ఆయన నిరాకరించారు. ఒకవేళ, ట్విట్టర్ బోర్డులో డైరెక్టర్‌గా చేరితే.. దానిని టేకోవర్ చేసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతాయని మస్క్ భావిస్తున్నట్లు సమాచారం.