హైదరాబాద్, ఆంధ్రప్రభ: విధుల్లో పారదర్శకతకుగానూ టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు విధానంలో విద్యాశాఖ మార్పులు తీసుకొస్తోంది. నిన్నటి వరకు బయోమెట్రిక్ అటెండెన్స్ ద్వారా హాజరును నమోదు చేసేవారు. తాజాగా జియో అటెండెన్స్‌ను (సెల్ఫీ తీసి పెట్టాలి) అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇందుకు పైలెట్ ప్రాజెక్టుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలను ఎంపిక చేశారు. ముందస్తుగా ఈ జిల్లాల్లోనే జీయో ఫోన్ యాప్ అటెండెన్స్‌ను అమలు చేయనున్నారు. ఇక్కడ వచ్చే ఫలితాలను బట్టి రాష్ట్ర వ్యాప్తంగా తర్వాత అమలు చేయనున్నారు.
అయితే ప్రస్తుతం ఈ జియో అటెండెన్స్ ఫోన్ యాప్ హాజరు విధానం నిజామాబాద్ జిల్లాల్లో అమల్లోకి ఉంది. అక్కడ దీన్ని ఆ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో పాఠశాలల్లో అందుబాటులోకి తీసుకొచ్చారు. అక్కడ సత్ఫలితాలు రావడంతో ఆ విధానాన్నే మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని విద్యాశాక భావిచింది. ఇందులో భాగంగానే ముందస్తుగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాలను ఎంపిక చేసుకుంది. దీనికి సంబంధించిన సర్కూలర్‌ను ఈనెల 25న పాఠశాల విద్యాశాఖ ఆయా జిల్లాల విద్యా, మండలాధికారులతో పాటు హెడ్మాస్టర్లకు ఆదేశాలు జారీచేసింది.
జియో అటెండెన్స్ అమలుపై పాఠశాల విద్యాశాఖ పలు సూచనలు చేసింది. టీచర్లు స్కూలుకు హాజరైనప్పుడు, విధులు ముగించుకొని వెళ్లే సమయంలో ఖచ్చితంగా ఫోటో (సెల్ఫీ) తీయాలి. ఒకవేళ ఏదైనా సమస్యతో మొబైల్‌లో ఇంటర్నెట్ పనిచేయకపోయినా, ఆఫ్‌లైన్‌లో ఉన్నా ఫోటో తీసి పెట్టే సౌకర్యాన్ని కల్పించారు. ఇంటర్నెట్ పనిచేసిన తర్వాత దానంతటఅదే యాప్‌లో రికార్డ్ అవుతాయని ఉత్తర్వుల్లో పేర్కొంది. టీచర్ ఎక్కడ ఉండి ఫోటో పెట్టారనే లొకేషన్ కూడా రికార్డ్ అవుతోంది. కేవలం అటెండెన్స్ మాత్రమే కాదు సెలవు కావాలన్నా అందులోనే వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్‌డ్యూటీలో భాగంగా ఇతర స్కూల్‌ను విజిట్ చేయడానికి వెళ్లినా అక్కడి నుంచి కూడా అటెండెన్స్ నమోదు చేసేలా దీన్ని రూపొందించారు.
ప్రస్తుతం బయోమెట్రిక్ ఉన్నాగానీ…
రాష్ట్రంలోని చాలా ప్రభుత్వ పాఠశాలల్లో బయోమెట్రిక్ హాజరు అమలవుతోంది. వరంగల్, సూర్యాపేట, ఆదిఆబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కామారెడ్డి, హనుమకొండ, జయశంకర్ భూపాలపల్లి, జగిత్యాల తదితర మొత్తం 20 జిల్లాల్లో అమలు చేస్తున్నారు. బయోమెట్రిక్ ద్వారానే టీచర్లు, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు నమోదు చేస్తున్నారు. కానీ ఈ విధానంలో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి. అయితే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో మాత్రం హాజరు నమోదు విధానంలో పెద్దగా పారదర్శకత లేకపోవడంతో ఇక్కడ జియో అటెండెన్స్‌ను అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది.
అందుకే ఈ మూడు జిల్లాల్లోని ప్రభుత్వ మండల పరిషత్తు, జిల్లా పరిషత్తు పాఠశాలల్లోని టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది హాజరు నమోదు చేసేలా చర్యలు చేపట్టింది. దీనికి సంబందించిన ఆదేశాలను కిందిస్థాయి అధికారులకు జారీ చేసింది. నేడో రేపో విద్యాధికారులు, హెచ్‌ఎంలకు లాగిన్ పాస్‌వర్డ్‌లను కూడా ఇవ్వనున్నారు. ఆ తర్వాత టీచర్ల వివరాలను అందులో యాక్టివేట్ చేయనున్నారు. ఒకట్రెండు రోజుల్లో ఇది పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నదని ఉపాధ్యాయులు చెబుతున్నారు.