కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండల కేంద్రంలోని హెచ్ పి పెట్రోల్ బంకు వద్ద టాస్క్ ఫోర్స్ అధికారులు నిర్వహించిన వాహనాల తనిఖీలలో భారీగా నిషేధిత గుట్కా ప్యాకెట్లు పట్టుబడ్డాయి. దాదాపు రూ. 3. 25 లక్షల గుట్కా ప్యాకెట్లను పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్ సీఐ బి.మల్లయ్య, కే సృజన్ రెడ్డి తెలిపారు. కొద్ది నెలలుగా కరీంనగర్ పట్టణం, ఆ చుట్టుపక్కల మండలాల్లో అక్రమంగా గుట్కా సరఫరా చేస్తున్నారన్న సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించామని వివరించారు.
శనివారం ఇల్లందకుంట మండలంలోని హెచ్ పి పెట్రోల్ బంక్ వద్ద వాహనాల తనిఖీ చేయగా టీ ఎస్ 36 జే 0042 నెంబర్ గల కారులో భోగం రాజేందర్, రౌతు శేఖర్ సిరిసేడు గ్రామానికి గుట్కా తరలిస్తుండగా 13సంచులు దొరికాయని తెలిపారు. వీటి విలువ 3 లక్షల 25 వేలు ఉంటుందని పేర్కొన్నారు. ఈ దాడులలో ఎస్ఐ సీహెచ్. నరసింహారావు, రఘుపతి, ఇల్లందకుంట ఎస్సై తిరుపతి టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.