భద్రాచలంలో శ్రీ రామ నవమి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రీసీతారామచంద్ర స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతున్నది. మిథిలా స్టేడియానికి ఉత్సవమూర్తులను చేరుకున్న అనంతరం పుణ్యాహవచనం, విష్వక్సేన ఆరాధన, యోత్ర ధారణ, కంకణ ధారణ, మాంగల్య ధారణ, తలంబ్రాల వేడుకలు జరిగాయి. సీతారాముల కల్యాణోత్సవం సందర్భంగా మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, పువ్వాడ అజయ్ కుమార్, సత్యవతి రాథోడ్ ప్రభుత్వం తరఫున స్వామిఅమ్మవారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అందించారు.
సీతారాముల కల్యాణం తిలకించేందుకు రెండేండ్ల తర్వాత భక్తులకు అనుమతించారు. దీంతో భద్రాచలం,ఆలయ వీధులు భక్తజనసందోహంగా మారాయి. పెద్దసంఖ్యలో భక్తులు తరలిరావడంతో మిథిలా స్టేడియం భక్తులతో కిక్కిరిసిపోయింది. కరోనా నేపథ్యంలో గత రెండేండ్లు ఉత్సవాలను ఏకాంతంగా నిర్వహించిన విషయం తెలిసిందే. కరోనా ప్రభావం తగ్గడంతో రాములోరి కల్యాణం తిలకించేందుకు భారీగా భద్రాచలానికి భక్తులు తరలివచ్చారు. రేపు శ్రీరామచంద్ర పట్టాభిషేక మహోత్సవం జరగనుంది.