Wednesday, November 20, 2024

Big Story: విత్తన మోసం.. బై బ్యాక్ డీల్‌తో న‌ష్టపోయిన రైతులు

ఈ ఏడాది అన్నదాతలను తెగుళ్లే కాదు, విత్తన కంపెనీలూ తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. ప్రధానంగా ఒప్పంద సేద్యంలో సాగుచేయించిన పంటను కంపెనీనే కొనుగోలు చేయాల్సి ఉన్నా.. టెస్టింగ్‌లో సీడ్‌ ఫెయిల్‌ అయిందంటూ రైతులు పండించిన పంటలను కొనుగోలు చేయకపోవడంతో సాగు చేసిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ఒప్పంద సేద్యంలో భాగంగా పలు కంపెనీలు అన్నదాతలతో పంటలను సాగుచేయించి, తీరా పంట చేతికొచ్చాక కొనుగోలు జరపకుండా దాటవేస్తున్నాయి. దీంతో ఎంతో కష్టం చేసి పండించిన పంట దిగుబడి వచ్చిన తర్వాత కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. ఈ ఏడాది ప్రభుత్వం నకిలీ విత్తనాలపై దృష్టి సారించినప్పటికీ ఒప్పంద సేద్యంలో సాగుచేయించే కంపెనీలు ఇస్తున్న విత్తనాలపై దృష్టి సారించకపోవడంతో వీటి రూపంలో నకిలీ విత్తనాలు యధేచ్చగా సాగైనట్టు తెలుస్తోంది. వాస్తవానికి ప్రతి ఏటా ఒప్పంద సేద్యంలో పంటలు సాగు చేయడం రైతులకు, కంపెనీలకు పరిపాటే అయినా.. ఈ సారి మాత్రం పలు విత్తనాలు నాసి రకానివి రావడం, కంపెనీల నాణ్యతా ప్రమాణాలకు తగ్గట్టు లేకపోవడంతో ఆయా కంపెనీలు స్వతహాగా రైతులకు ఇచ్చి సాగు చేయించిన పంటను కూడా కొనుగోలు చేయని పరిస్థితులకు దారితీసింది. దీంతో రైతులు ఆంధ్రాలోని గుంటూరు మార్కెట్‌కు వెళ్లినా ఫలితం లేకపోవడంతో మా పరిస్థితేంటంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

800 ఎకరాల్లో బైబ్యాక్‌ సాగు.. కొనుగోలు అస్సలు లేదు..
ఈ ఏడాది తెలంగాణలో మిర్చి పంట సుమారు 3.50లక్షల ఎకరాల్లో సాగు కాగా ఇందులో కంపెనీల ద్వారా కొన్ని ప్రాంతాల్లో ఒప్పంద సేద్యం కూడా సాగైంది. వీటిలో భాగంగా ప్రధానంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాతో పాటు, వాజేడు, వెంకటాపురం ప్రాంతాల్లోనూ బై బ్యాక్‌ మిర్చి పంట సాగైంది. సుమారు 800 ఎకరాల్లో సాగైన ఈ పంట ఇప్పుడు కోతకు రాగా, టెస్టింగ్‌లో సీడ్‌ ఫెయిల్‌ అయిందన్న కారణంతో విత్తనాలు ఇచ్చి సాగు చేయించిన కంపెనీ కొనుగోలుకు నిరాకరిస్తుంది. కంపెనీనే కొనుగోలు చేయకపోవడంతో బయట మార్కెట్‌లోని వ్యాపారులు కొనుగోలుకు మొహం చాటేస్తున్నారు.

యూఎస్‌ 341 బ్యాన్‌తో.. ఎన్‌వీఆర్‌ 5884, 4884 రకాల సాగు..
భద్రాద్రి జిల్లాలోని చర్ల, వాజేడు, వెంకటాపురం పరిసర ప్రాంతాల్లో ఏ.వి.టీ అనే కంపెనీతో పాటు ఇతర కంపెనీలు ఒప్పంద సేద్యం కోసం సుమారు 800 ఎకరాల్లో ఎన్‌విఆర్‌ 5884, 4884 అనే రెండు రకాల మిర్చి విత్తనాలను ఇచ్చి సాగు చేయించారు. ప్రస్తుతం ఈ రెండు రకాల పంటలు కోత కోసి పంట విక్రయానికి సిద్ధంగా ఉన్న సమయంలో విత్తనాలను టెస్టింగ్‌కు తీసుకెళ్లిన కంపెనీ ప్రతినిధులు ఫెయిల్‌ అయ్యాయి.. కొనుగోలు చేయబోమని చెప్పడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కంపెనీ ఇచ్చిన విత్తనాలనే సాగుచేశాం, వారు సూచించిన పురుగు మందులనే పిచికారీ చేశాం.. తీరా ఇపుడు నాణ్యత, రంగు లేదన్న కారణంతో కొనుగోలు చేయబోమంటున్నారు. ఇప్పుడు తమ పరిస్థితేంటంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే సాగు చేసిన పంటను కచ్చితంగా కొనుగోలు చేయాల్సిందేనంటూ రైతులు ధర్నాలు, నిరసనలకు దిగుతున్నారు.

యూఎస్‌ 341 రకం బ్యాన్‌తో.. ఈ రెండు రకాలు..
ప్రస్తుతం కంపెనీ సాగుచేయించిన ఎన్‌విఆర్‌ 5884, 4884 అనే రెండు రకాల విత్తనాల స్థానంలో గతంలో యూఎస్‌ 341 అనే ఒకే విత్తనాన్ని సాగుచేయించేది. అయితే ఈ విత్తనం కూడా రెండేళ్ల క్రితం నాసిరకంగా రావడంతో పంట దిగుబడి తగ్గి, నష్టమేర్పడింది. దీంతో రైతులు కోర్టుకు వెళ్లడంతో కోర్టు యూఎస్‌ 341 రకాన్ని మూడేళ్ల పాటు నిషేధించింది. దీంతో దీని స్థానంలో రెండు రకాల విత్తనాలను కంపెనీ సాగుచేయించింది. ఈ విత్తనాలు కూడా నాసిరకానివి రావడంతో పంట దిగుబడి తగ్గడంతో పాటు, కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -

మార్కెట్‌ ధర కంటే అధికంగా కొనుగోలు.. కానీ..
వాస్తవానికి బై బ్యాక్‌ సాగు ద్వారా మార్కెట్‌ ధర కంటే అదనంగా ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేస్తాయి. అయితే ఈ విధానంలోనూ కంపెనీలు కేవలం విత్తనాలను మాత్రమే అందించనున్నాయి. కానీ పంటకు వినియోగించాల్సిన కెమికల్స్‌, సాగు పద్దతులను మాత్రం కంపెనీ ప్రతినిధులు రైతులకు ప్రతిరోజూ సూచిస్తుంటారు. వారి పర్యవేక్షణలోనే సాగయ్యే పంటకు విత్తన విఫలాన్ని రైతులకు అంటగట్టి ఇపుడు పూర్తిగా కొనుగోలే చేయమంటూ తేల్చి చెబుతున్నారు. దీంతో పండిన పంటను ఏంచేయాలంటూ రైతులు వాపోతుండగా, కంపెనీలపై చర్యలు తీసుకోవాలంటూ అధికారులను కోరుతున్నారు.

తీరా పంటొచ్చాక కొనుగోలు లేదంటే ఎలా: పెద్దారెడ్డి, ఒప్పంద రైతు, చర్ల మండలం, జీపి పల్లి, గ్రామం
నేను 15 ఎకరాల్లో బై బ్యాక్‌ విధానంలో మిర్చి సాగుచేశా. ఇపుడు పంట చేతికొచ్చాక టెస్టింగ్‌లో సీడ్‌ ఫెయిల్‌ అయింది కొనుగోలు చేయడంలేదంటూ కంపెనీ అంటోంది. ఇపుడు ఏం చేయాలో కూడా అర్ధం కావడంలేదు. కెమికల్స్‌, సాగు విధానం అన్నీ కంపెనీ ప్రతినిధుల సూచనల ప్రకారమే చేసాను. అయినా విత్తనం ఫెయిల్‌ అయిందంటున్నారు. మార్కెట్‌లోనూ ఎవరూ కొనుగోలు చేయడానికి ముందుకు రావడంలేదు. అధికారులే చర్యలు తీసుకోవాలి.

కొనుగోలు చేయాలని చెప్పాం: మరియన్న, ఉద్యానవన జిల్లా అధికారి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
రైతులకు విత్తనాలు ఇచ్చి సాగుచేయించిన కంపెనీలే కొనుగోలు చేయాలని కంపెనీలకు చెప్పాం. కొనుగోలు చేయకపోతే అగ్రికల్చర్‌, మార్కెటింగ్‌ అధికారులతో చర్చించి చర్యలు తీసుకుంటామని కంపెనీ ప్రతినిధులకు తెలిపాం. యూఎస్‌ 341నిషేధం ఉండడంతో దాని కొనుగోలుకు అవకాశం లేదు. మిగతా రకాలను కొనుగోలు చేయాల్సిందేనని కంపెనీకి చెప్పాం.

Advertisement

తాజా వార్తలు

Advertisement