ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఎంతో కాలంగా ఉత్కంఠగా ఎదురుచూసిన ‘RRR’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో వేల స్క్రీన్లలో విడుదలైంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రమిది. దర్శకడధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తారక్, రామ్ చరణ్ లు కొమరం భీం, అల్లురి సీతారామరాజు పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని చూసేందుకు సినీప్రేక్షకులు క్యూ కట్టారు. ప్రీమియర్స్, బెనిఫిట్ షోలతో సినిమాకు సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది.
చాలా కాలం తర్వాత తెలుగులో పెద్ద హీరోలు కలిసి నటించిన సినిమా ఇది. దీంతో ఈ మల్టీస్టారర్ సినిమాపై అంచానలు తారా స్థాయికి చేరాయి. దర్శకధీరుడు రాజమౌళి ఈ సినిమాని ఫిక్షనల్ అండ్ పీరియాడిక్ చిత్రంగా తెరకెక్కించాడు. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా కరోనా లాక్డౌన్, టికెట్ రేట్ల సమస్యలు, వైరస్ బారిన పడటం, గాయాలు అవ్వడం, వాయిదాల పర్వం ఇలా ఎన్నో సవాళ్లను ఎదుర్కొని ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగురాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా థియేటర్లు కళకళలాడుతున్నాయి. దాదాపు మూడేళ్ల తర్వాత తమ అభిమాన హీరోలు వెండితెరపై కనపించడం వల్ల అభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని అభిమానులు ధర్శకుడు రాజమౌళి, తారక్, చరణ్ కటౌట్లకు అభిషేకాలు చేసి కొబ్బరికాయలు కొడుతున్నారు . బాణాసంచా కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు.
మరోవైపు సినిమా అదిరిపోయిందని సోషల్‌మీడియాలో రివ్యూలు ఇస్తున్నారు. హీరోల ఇంట్రడక్షన్, ఫైటింగ్ సీక్వెన్స్, క్లైమాక్స్, విజువల్స్ ఊహకందని స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయిలో పెంచిన ‘బాహుబలి’ని మించేలా ఉందని మరికొంతమంది అభిమానులు పేర్కొంటున్నారు. ఎన్టీఆర్, రామ్‌చరణ్ నటనలో తమ విశ్వరూపాన్ని చూపించారని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. తారక్ పులిలా గర్జించి విరుచుకుపడగా… చరణ్ అగ్గి పిడుగులా చెలరేగిపోయాడని.. వారిద్దరు చెప్పిన డైలాగ్‌లు, ఇద్దరు కలిసి నటించిన సన్నివేశాలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ రోమాలు నిక్కబొడుచుకునేలా ఉన్నాయని తెలుపుతున్నారు. పోరాట యోధుడిగా కనిపించిన అజయ్‌దేవగణ్, ఆయన భార్య పాత్రలో కనిపించిన శ్రియ పాత్రలు ఎంతో భావోద్వేగాలతో రూపుదిద్దుకున్నాయని… కొన్ని సన్నివేశాల్లో వారు చెప్పిన డైలాగ్‌లు, పండించిన హావభావాలు ప్రేక్షకుల హృదయాల్ని ద్రవింపచేసేలా ఉన్నాయని చెబుతున్నారు. సముద్రఖని, రాజీవ్ కనకాల, రాహుల్ రామకృష్ణ కూడా వాళ్ల పాత్రలకు బాగా న్యాయం చేశారని.. హాలీవుడ్ నటులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచారని, ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాలకు తాకుతున్నాయని చెబుతున్నారు.
సినిమా చూసినంత సేపు ‘ఆర్ఆర్ఆర్’ లోకంలో లీనమైపోయినట్లు సినిమా చూసిన ప్రేక్షకులు చెబుతున్నారు. కథ, కథనం, పాత్రలు, పాత్రల మధ్య అనుబంధం, సంఘర్షణ, భావోద్వేగాలు.. ప్రేక్షకులు ఊహించిన దానికంటే జక్కన్న అద్భుతంగా మలిచారని తెలుపుతున్నారు. మొత్తంగా ఈ సినిమా కుంభస్థలాన్ని బద్దలు కొడుతుంది, చరిత్రలో నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.