Tuesday, November 26, 2024

భార‌త్ జోడోయాత్ర‌కి భ‌ద్ర‌త క‌ల్పించండి.. అమిత్ షాకి ఖ‌ర్గే లేఖ‌

భ‌ద్ర‌తా లోపం కార‌ణంగా తాత్కాలికంగా నిలిచిపోయింది భార‌త్ జోడో యాత్ర‌. ఈ మేర‌కు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గే కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. కేంద్ర పాలిత ప్రాంతంలో పాదయాత్రకు తగిన భద్రత కల్పించడంలో జోక్యం చేసుకోవాలని కోరారు. ‘రెండు రోజుల్లో యాత్ర ముగుస్తుంది. ఈ నెల 30వ తేదీన శ్రీనగర్‌లో జరిగే ముగింపు కార్యక్రమంలో భారీ జనసందోహంతో పాటు పలువురు కాంగ్రెస్ సీనియర్ నేతలు, ఇతర ముఖ్యమైన రాజకీయ పార్టీల నేతలు హాజరవుతున్నారు. ఈ విషయంలో మీరు వ్యక్తిగతంగా జోక్యం చేసుకుని, యాత్ర ముగిసే వరకు తగిన భద్రత కల్పించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లయితే నేను కృతజ్ఞుడన‌ని చెప్పారు. జోడో యాత్రలో రాహుల్ గాంధీ చుట్టూ ఉన్న భద్రతా సిబ్బందిని ఉపసంహరించుకుందని కాంగ్రెస్ ఆరోపించింది. దాంతో శుక్రవారం అనంతనాగ్ జిల్లాలో తన పాదయాత్రను రద్దు చేసుకోవాల్సి వచ్చిందని రాహుల్ చెప్పారు. ఈ క్రమంలో భద్రతా లోపానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. రాహుల్ గాంధీ జోడో యాత్ర ఒకరోజు నిలిపివేసిన అనంతరం శనివారం పుల్వామా జిల్లాలో తిరిగి ప్రారంభమైంది. పీడీపీ అధినేత మెహబూబా ముఫ్తీ, ఆమె కుమార్తె ఇల్తిజా ముఫ్తీ, పీడీపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో యాత్రలో పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement