హైదరాబాద్, ఆంధ్రప్రభ బ్యూరో: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్న పల్నాడు జిల్లా నరసరావుపేటకు చెందిన సాయి డిఫెన్స్ అకాడమీ సంస్థ అధిపతి ఆవుల సుబ్బారావును తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరసరావుపేట వెళ్లిన ప్రత్యేక పోలీస్ బృందం సుబ్బారావును ఇక్కడికి తీసుకువచ్చింది. సాయి డిఫెన్ అకాడమీకి చెందిన పది శిక్షణా సంస్థల్లో చదివిన విద్యార్థులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారని అనుమానిస్తున్న పోలీసులు బుధవారం నుంచి సుబ్బారావును విచారించి కీలక సమాచారాన్ని రాబట్టాలని నిర్ణయించారు.
అయితే సికింద్రాబాద్ ఘటనలో సుబ్బారావుకు ఎటువంటి సంబంధం లేదని ఆయన తరఫు న్యాయవాది నరసరావుపేట పోలీసులను కలిసి ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై తొలుత కేసు నమోదు చేసుకుని 50మందికి పైగా నిందితులను గుర్తించి వారిపై కేసులు నమోదు చేసిన రైల్వే పోలీసులు తదుపరి విచారణను హైదరాబాద్ నగర పోలీసులకు అప్పగించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారణకు సీసీఎస్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు.
సుబ్బారావుకు హైదరాబాద్, నరసరావుపేటతో సహా పది పట్టణాల్లో సాయి డిఫెన్స్ అకాడమీ విభాగాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ పది అకాడమీలలో శిక్షణ పొందుతున్న ఉద్యోగార్తులు రైల్వే స్టేషన్ దాడి ఘటనలో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. దాడి ఘటనలో గాయాల పాలై సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందిన ఎనిమిది మందిని ఆస్పత్రి సూపరింటెండెంట్ మంగళవారం డిశ్చార్జ్ చేశారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు చెబుతున్నారు.
బుధవారం నుంచి ఆవుల సుబ్బారావును విచారణ జరిపితే ఈ కేసులో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. దీంతో ఈ కేసులో మరిన్ని అరెస్టులు జరిగే అవకాశముందని తెలుస్తోంది. సాయి డిఫెన్స్ అకాడమీ సుబ్బారావు ఉద్యోగార్థులను రెచ్చగొట్టడంతో పాటు వారితో వాట్సప్ గ్రూపులను రూపొందించి ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న ఆశావహులకు వాట్సప్, ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా సంక్షిప్త సందేశాలు పంపించారని పోలీసులు నిర్ధారించారు. దాడి జరిగిన రోజున అందులో పాల్గొన్న వారికి ఆర్థిక సాయం చేయడంతో పాటు అంతకు ముందు రోజు సికింద్రాబాద్ పరిసర ప్రాంతాల్లో బస చేసేందుకు వసతి సౌకర్యం కల్పించడంలో సుబ్బారావు కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు చెబుతున్నారు.
ఈ ఘటనలో సుబ్బారావు నేరుగా పాల్గొని అభ్యర్థులకు ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు ఇచ్చారని కూడా ఆరోపణలు వినవస్తున్నాయి. నరసరావుపేటలోని సాయి డిఫెన్స్ అకాడమీపై ఆకస్మిక దాడులు నిర్వహించిన కేంద్ర నిఘా వర్గాలు, ఆదాయ పన్ను శాఖ అధికారులు అకాడమీకి చెందిన కీలక దస్త్రాలను స్వాధీనం చేసుకోవడంతో పాటు ల్యాప్‌టాప్, కంప్యూటర్ హార్డ్ డిస్క్‌లను తమతో తీసుకువెళ్లినట్టు తెలుస్తోంది. తమ అకాడమీలో చేరి ఉద్యోగం సాధించిన యువకుల నుంచి సుబ్బారావు లక్ష రూపాయలు వసూలు చేస్తాడని ఈ మేరకు అభ్యర్థుల నుంచి ముందుగానే బాండ్లు రాయించుకుంటాడని ప్రచారం జరుగుతోంది.
లక్ష రూపాయలు చెల్లించిన వారికి ఎటువంటి రసీదులు ఇవ్వడని అంతకు ముందు తీసుకున్న బాండ్లు, పేపర్లను సుబ్బారావుతో పాటు తన కార్యాలయంలో పని చేసే ఉద్యోగులు అభ్యర్థుల ఎదుటే చించి వేస్తారని పోలీసులు ప్రాథమిక సాక్ష్యాలను రాబట్టారు. బుధవారం నుంచి జరిగే విచారణలో సికింద్రాబాద్ దాడి ఘటనలో సాయి డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందుతున్న అభ్యర్థుల పాత్ర, సుబ్బారావు వ్యవహారాలపై పూర్తి సమాచారాన్ని రాబట్టి దర్యాప్తును ముమ్మరం చేసేందుకు హైదరాబాద్ నగర పోలీసులు సమాయత్తమవుతున్నారు.