నెల్లూరు జిల్లా కృష్ణపట్నం పేరు ఇప్పుడు దేశవ్యాప్తంగా మార్మోగుతోంది. కరోనాకు ఆనందయ్య తయారు చేసిన మందుపై సర్వత్ర చర్చ జరుగుతోంది. ఆనందయ్య మందుతో తాము కరోనా నుంచి కోలుకున్నామని కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేయడంతో అందరి దృష్టి కృష్ణపట్నంపై పడింది. ప్రస్తుతం ఆనందయ్య మందు పంపిణీ పై సందిగ్ధత ఇంకా కొనసాగుతూనే ఉంది. గత రెండు రోజులుగా ఆనందయ్య మందు పంపిణీ కార్యక్రమం నిలిచిపోయింది. ప్రస్తుతం కృష్ణపట్నంలో 144 సెక్షన్ విధించిన పోలీసులు… ఆనందయ్య మందు కోసం వచ్చే వారిని వెనక్కి పంపుతున్నారు.
మరోవైపు ఆనందయ్య ఆయుర్వేద ఔషధంపై ఏపీ ఆయుష్ కమిషన్ పరిశీలన ముగిసింది. నిన్న ఆయూష్ ప్రతినిధుల సమక్షంలో ఆనందయ్య మందును తయారు చేశారు. ఆ మందులో హానికర పదార్థాలు లేవని ఆయూష్ కమిషనర్ రాములు తెలిపారు. కానీ ఆనందయ్య తయారు చేస్తున్న మందుని ఆయుర్వేదంగా గుర్తించలేమన్న రాములు… ఆనందయ్య మందును నాటుమందుగానే పరిగణిస్తామని వెల్లడించారు. కళ్లలో వేసే డ్రాప్స్‌లో కూడా సాధారణ పదార్థాలే వాడుతున్నారని చెప్పారు. అయితే ఆనందయ్య మందు రోగులపై పనిచేస్తుందా లేదా అనేది ఆయుర్వేద డాక్టర్ల బృందం తేల్చుతుందని రాములు వెల్లడించారు. డాక్టర్ల బృందం పరిశీలన అనంతరం తమ నివేదికను సీసీఆర్ఎఎస్‌కు పంపుతుందున్నారు. అన్ని నివేదికలు వచ్చిన తర్వాత మందు పంపిణీపై ప్రభుత్వం నిర్ణయం వస్తుందని రాములు వెల్లడించారు.
ఇక, ఆనందయ్య మందుపై ఆయుష్ బృందం ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. మరోవైపు ఐసీఎంఆర్ బృందం కూడా కృష్టపట్నం రానున్నారు. ఐసీఎంఆర్ బృందం సమక్షంలో మరో సారి ఆనందయ్య.మందు తయారు చేసే అవకాశం ఉంది.
ఇదీ చదవండి: ఆనందయ్య కరోనా మందు: క్రిటికల్ గా రిటైర్డ్ మాస్టర్ కోటయ్య ఆరోగ్యం