Friday, November 22, 2024

Second Phase – రెండో ద‌శ పోలింగ్ ప్రారంభం…13 రాష్ట్రాలు.. 88 లోక్‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు

పోలింగ్ స‌మ‌యం పెంచిన ఎన్నిక‌ల సంఘం
రెండో ద‌శ బ‌రిలో మ‌హామ‌హులు
అదృష్టాన్ని ప‌రీక్షించుకుంటున్న బ‌డా లీడ‌ర్లు
కేంద్ర మంత్రి షెకావ‌త్‌, స్పీకర్ ఓం బిర్లా..
కాంగ్రెస్ ముఖ్య నేతలు రాహుల్ గాంధీ, శ‌శి ధ‌రూర్,
సినీ స్టార్ హేమ మాలిని, భూపేశ్ బఘేల్,
డీకే సురేష్, కుమార్ స్వామి, తేజస్వీ సూర్య

లోక్‌సభ ఎన్నికల్లో రెండో దశ పోలింగ్ నేటి ఉదయం ప్రారంభమైంది.. ఈ విడతలో 13 రాష్ట్రాల్లోని మొత్తం 88 లోక్‌సభ స్థానాలకు ఓటింగ్‌ను నిర్వహించనున్నారు. వాస్తావానికి 89 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించాల్సి ఉండగా 88 స్థానాల్లోనే పోలింగ్ జ‌రుగుతోంది. ఎందుకంటే.. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ స్థానం నుంచి బరిలోకి దిగిన బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అభ్యర్థి అశోక్ భలవి ఏప్రిల్ 9న చనిపోయారు. దీంతో అక్కడ జరగాల్సిన ఎన్నికను కేంద్ర ఎన్నికల సంఘం మూడో దశకు (మే 7వ తేదీకి) వాయిదా వేసింది. .

- Advertisement -

పొలింగ్ స‌మ‌యం పెంపు ..

ఎండలు, వడగాలుల ప్రభావం ఎక్కువగా ఉన్నందున బీహార్‌లోని పలు స్థానాల పరిధిలో పోలింగ్ సమయాన్ని పెంచుతున్న‌ట్టు ఈసీ తెలిపింది. బంకా, ఖగారియా, ముంగేర్, మాధేపురా స్థానాల పరిధిలోని సమస్యాత్మక ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని తొలుత భావించారు. అయితే.. ఎండల కార‌ణంగా ఓటర్ల సౌకర్యం కోసం ఆయా చోట్ల పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6గంటల వరకు పొడిగించారు. ముంగేర్‌లోని 230 పోలింగ్ స్టేషన్లు, ఖగేరియాలోని 299, మాధేపురాలోని 207, బంకాలోని 363 పోలింగ్ స్టేషన్లలో సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది.

ఏ ఏ రాష్ట్రాల్లో అంటే ..

కేరళలోని 20 లోక్‌సభ స్థానాలు, కర్నాటక- 14, రాజస్థాన్‌- 13, మహారాష్ట్ర- 8, ఉత్తర్ప్రదేశ్‌- 8, మధ్యప్రదేశ్‌- 6, అసోం, బిహార్‌లలోని చెరో ఐదు స్థానాలు, ఛత్తీస్‌గఢ్‌, బంగాల్‌లలోని చెరో 3 స్థానాలు, మణిపుర్‌, త్రిపుర, జమ్ముకశ్మీర్‌లోని చెరో స్థానానికి పోలింగ్ కొనసాగుతున్నది..

బ‌రిలో ఉన్న ప్ర‌ముఖులు వీరే..

కాంగ్రెస్ ముఖ్య‌నేత రాహుల్ గాంధీ..

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచే పోటీ చేస్తున్నారు. రెండోసారి కూడా అక్కడి నుంచి గెలవాలనే పట్టుదలతో ఉన్నారు. ఇక్కడ రాహుల్ గాంధీతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. సురేంద్రన్‌ తలపడుతున్నారు. సీపీఐ అభ్యర్థి అన్నీ రాజా కూడా పోటీలో ఉన్నారు. 2019 ఎన్నికల్లో రాహుల్ గాంధీ ఉత్తర్​ప్రదేశ్‌లోని అమేథీతో పాటు వయనాడ్‌లోనూ పోటీ చేశారు. అయితే ఆయన అమేథీలో ఓడిపోగా, వయనాడ్‌లో గెలిచారు. అప్పట్లో రాహుల్ గాంధీకి వయనాడ్‌లో దాదాపు 7 లక్షల ఓట్లు పోలయ్యాయి.

హేమ మాలిని

ప్రముఖ నటి, బీజేపీ నేత హేమమాలిని ఉత్తర్​ప్రదేశ్‌లోని మథుర నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. 2014, 2019 ఎన్నికల్లోనూ మథుర నుంచి ఆమె గెలిచారు. ఈసారి కూడా గెలిచి హ్యాట్రిక్ సాధించాలనే పట్టుదలతో హేమమాలిని ఉన్నారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తర్​ప్రదేశ్‌ కాంగ్రెస్ సీనియర్ నేత ముఖేష్ ధంగర్‌ పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో ఈ సీటులో హేమ మాలినికి 5,30,000 ఓట్లు వచ్చాయి. సమీప ప్రత్యర్థి రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) నేత కున్వర్ నరేంద్ర సింగ్‌పై 2.93 లక్షల ఓట్ల భారీ మెజారిటీతో హేమమాలిని గెలిచారు.

అరుణ్ గోవిల్

రామాయణం సీరియల్‌లో రాముడి పాత్రలో నటించి యావత్ దేశం మన్ననలు అందుకున్న ప్రఖ్యాత టీవీ నటుడు అరుణ్ గోవిల్ మీరఠ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన బీజేపీ తరఫున ఎన్నికల బరిలోకి దిగారు. బీఎస్పీకి చెందిన దేవవ్రత్ కుమార్ త్యాగి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన సునీతా వర్మ ఈ స్థానంలో అరుణ్ గోవిల్‌తో తలపడుతున్నారు. 2019లో బీజేపీ అభ్యర్థి రాజేంద్ర అగర్వాల్ 5.86లక్షల ఓట్లు సాధించి బీఎస్పీ అభ్యర్థి హాజీ మహ్మద్ యాకూబ్‌పై గెలిచారు.

ఇతర కీలక అభ్యర్థులు

రెండో విడత ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఇతర కీలక నేతల జాబితాలో కాంగ్రెస్ కీల‌క నేత శశి థరూర్ (తిరువనంతపురం), రాజీవ్ చంద్రశేఖర్ (తిరువనంతపురం), ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎం భూపేశ్ బఘేల్ (రాజ్‌నంద్‌గావ్), డీకే సురేష్ (బెంగళూరు గ్రామీణం), కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ (జోధ్‌పుర్), లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా (కోటా), వంచిత్ బహుజన్ అఘాడీ చీఫ్ ప్రకాశ్ అంబేడ్కర్ (అకోలా), బీజేపీ బంగాల్ అధ్యక్షుడు సుకాంత మజుందార్ (బాలూర్‌ఘాట్), అనిల్ ఆంటోనీ (పతనంతిట్ట), తేజస్వి సూర్య(బెంగళూరు దక్షిణం), హెచ్‌డీ కుమార్ స్వామి(మాండ్యా), వైభవ్ గెహ్లత్(జలోర్), శోభ కరంద్లాజే (బెంగళూరు ఉత్తరం) తదితరులున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement