అహ్మదాబాద్ వేదికగా విండీస్ తో ఇవ్వాల రెండో వన్డే రెడీ జరుగుతోంది. మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటికే అదిరే బోణి కొట్టిన టీమిండియా పూర్తి ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగింది. దక్షిణాఫ్రికాలో పరాభవం తర్వాత రోహిత్ కెప్టెన్సీలో వెస్టిండీస్‌తో ఆడిన తొలి వన్డేలో పూర్తిగా పై చేయి కనబరించింది. ఫస్ట్ మ్యాచులో అన్ని విభాగాల్లో సత్తా చాటింది రోహిత్ సేన. ఇక, ఈ మ్యాచులో విండీస్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ వన్డేకు ఓపెనర్ కేఎల్ రాహుల్ అందుబాటులోకి రావడంతో ఇషాన్ కిషన్‌పై వేటు పడింది.
ఓపెనర్లుగా బరిలోకి దిగిన రోహిత్ కొద్ది సేపటికే పెవిలియన్ చేరాడు. కేవలం 5 పరుగులు మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో విరాట్ కోహ్లీ బ్యాటింగ్‌కు వచ్చాడు. కాగా కోహ్లీ కూడా 18 పరుగులు మాత్రమే చేసి తిరుగుముఖం పట్టాడంతో అంతా నిరాశకు గురయ్యారు. రిషబ్ పంత్ కూడా 18 రన్స్ మాత్రమే చేసి ఔటయ్యాడు. దీంతో 12 ఓవర్లు, 43 పరుగుల వద్ద టీమిండియా కీలకమైన 3 వికెట్లు కోల్పోయింది. ప్రస్తుతం క్రీజులో కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్ ఉన్నారు.
మరోవైపు మాజీ కెప్టెన్ కోహ్లీకి ఇది కీలక మ్యాచ్. అతడు 71వ అంతర్జాతీయ శతకం కోసం కళ్లు కాయలు కాచేలా రెండేళ్లుగా వేచి చూశాడు. ఈ మ్యాచ్ ద్వారా తన సెంచరీ దాహాన్ని తీర్చుకోవాలని కోహ్లీ భావించాడు. ఈ వన్డే విరాట్ కు స్వదేశంలో 100 వది. దీంతో ఈ మైల్ స్టోన్ మ్యాచులో కోహ్లీ సెంచరీ చేయాలని అతని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. కానీ, అనుకోకుండా కోహ్లీ 18 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు.