Saturday, November 23, 2024

కరోనా మహోగ్రరూపం.. ఒక్కరోజే 2,104 మంది మృతి!

 దేశంలో కరోనా వైరస్ విలయతాండవం చేస్తోంది. నిత్యం రికార్డుస్థాయిలో కేసులు, మరణాలు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 3,14,835 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 2,104 మంది మృతి చెందారు. 1,78,841 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో దేశంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 1,59,30,965కు పెరిగింది. ఇప్పటి వరకు 1,34,54,880 మంది కోలుకోగా.. 1,84,657 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 22,91,428 యాక్టివ్‌ కేసులున్నాయని కేంద్రం వివరించింది. 

ఇక తెలంగాణలో కొత్తగా 5,567 మందికి కరోనా పాజిటివ్ నిర్ధార‌ణ అయింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… ఒక్క‌రోజులో కరోనాతో 23 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే సమయంలో  2,251 మంది కోలుకున్నారు. జీహెచ్ఎంసీ ప‌రిధిలో కొత్త‌గా 989 మందికి క‌రోనా సోకింది. రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 3,73,468కి చేరింది. ఇప్పటివరకు మొత్తం 3,21,788 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,899గా ఉంది. తెలంగాణలో ప్రస్తుతం 49,781 మంది కరోనాకు చికిత్స పొందుతున్నారు.

ఓ వైపు వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతుండగానే.. మరోవైపు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దీంతో పలు రాష్ట్రాల్లో లాక్‌డౌన్, నైట్ కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దేశంలో అత్యధికంగా మహారాష్ట్రలో ఆ తరువాత ఢిల్లీ, తమిళనాడు, కేరళ, పంజాబ్, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, కర్ణాటక, ఏపీ, తెలంగాణ తదితర రాష్ట్రాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. ఆయా రాష్ట్రాల్లో కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. మరోవైపు కరోనా చికిత్సలో అత్యవసరంగా ఉపయోగించే రెమిడెసివిర్ ఔషధం కొరత కూడా వేధిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement