భారత్..పాకిస్థాన్ సరిహద్దులో భారీ పేలుడు సంభవించింది. దాంతో అప్రమత్తమయ్యాయి భద్రతా బలగాలు. ఈ మేరకు పేలుడు కోణంలో సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. జమ్మూకాశ్మీర్ లోని కథువా జిల్లాలో బుధవారం రాత్రి పేలుడు సంభవించడంతో ఆ ప్రాంతంలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కథువా జిల్లా హీరానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంతర్జాతీయ సరిహద్దు సమీపంలోని బోర్డర్ పోలీస్ పోస్ట్ సానియాల్ వద్ద గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.డ్రోన్ ద్వారా తీసుకెళ్లి సరిహద్దుకు సమీపంలో అనుకున్న టార్గెట్ కాకుండా వేరే ప్రదేశంలో పడేసిన ఇంప్రొవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైజ్ (ఐఈడీ) కారణంగానే ఈ శక్తివంతమైన పేలుడు సంభవించి ఉండొచ్చని అధికారులు పేర్కొన్నట్టు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
అయితే, ఈ భారీ పేలుడు కారణంగా ఇప్పటి వరకు మరణాలు కానీ, ఎవరికీ ఎలాంటి గాయాలు కానీ కాలేదని సమాచారం.ఈ పేలుడుకు సంబంధించిన సమాచారం అందిందని కథువా ఎస్ఎస్పీ శివదీప్ సింగ్ జమ్వాల్ తెలిపారు. గురువారం ఉదయం కూడా గాలింపు చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. బాంబ్ స్క్వాడ్ ఘటనా స్థలం నుంచి నమూనాలు సేకరించి పరీక్షలకు పంపిందని ఎస్ఎస్పీ తెలిపారు. బుధవారం రాత్రి 9.30 గంటల సమయంలో పేలుడు శబ్దం వినిపించిందని సానియాల్ గ్రామ నివాసి, బ్లాక్ డెవలప్ మెంట్ కమిటీ (బీడీసీ) చైర్మన్ రామ్ లాల్ కలియా తెలిపారు. ఈ క్రమంలోనే తాను పోస్ట్ ఇంచార్జ్ కు సమాచారం ఇచ్చాననీ, ఆయన కూడా పేలుడు శబ్దం వినిపించిన విషయాన్ని ధృవీకరించారని వివరించారు.భారీ శబ్దం వినిపించిన తర్వాత పేలుడు జరిగిన ప్రదేశాన్ని గుర్తించామని, వ్యవసాయ క్షేత్రంలో పెద్ద బిలం కనిపించిందని తెలిపారు.