– ప్రభ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి
హైదరాబాద్ ప్రజలు సిటీ బస్సులమీదనే ఎక్కువగా ప్రయాణిస్తుంటారు. ఆటోలు, క్యాబ్‌లు వచ్చినా.. సిటీ బస్సులో జర్నీమీదనే ఇంట్రస్ట్ చూపుతుంటారు. 4000 బస్సులతో 42 వేల ట్రిప్పుల ద్వారా నిర్దేశించిన 850 రూట్లలో రోజూ 35 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేది గ్రేటర్ జోన్ టీఎస్‌ఆర్టీసీ. రెండేండ్ల కాలంలో వాటిని 2800లకు కుదించడంతో 12 వేల ట్రిప్పులు తగ్గాయి. ప్రస్తుతం ఈ సంఖ్య కూడా తగ్గిందని తెలుస్తోంది. కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్తవి కొనుగోలు చేయక పోవడంతో ప్రతి నెలా 10 నుంచి 20 బస్సుల వరకు షెడ్లకే పరిమితమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం నడుస్తున్న 28 వందల బస్సుల్లో సగానికి పైగా డొక్కు బ స్సులు కావడంతో తరుచూ రిపేర్లు వస్తున్నాయి..
నడుస్తూ… నడుస్తూనే నడి రోడ్లపై ఒక్క కుదుపుతో ఆగి పోతున్నాయి. గురువారం రాత్రి 8 గంటలకు హెచ్‌సీయూ డిపోకు చెందిన 10హెచ్ నెంబర్ బస్సు సికింద్రాబాద్ నుంచి కొండాపూర్ వై పు వెలుతూ వెంకటగిరి మెట్రో దాటిన తర్వాత చిన్న పాటి ఘాట్ రోడ్డువద్ద ఒక్క కుదుపుతో ఆగి పోయింది . దీంతో డ్రైవర్ ప్రయాణికులను దింపి వారితోనే అర పర్లాం గ్ వరకు తోయించారు. ఎట్టకేలకు పల్లం వరకు చేరడంతో బస్సులో తిరిగి ప్రయాణికులను ఎక్కించుకున్నారు. ఇలాంటి సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. నగరంలో సిటీ బస్సులు నిత్యం మొరాయిస్తుండటంతో ప్రయాణికులతో పాటు సిబ్బందికి తిప్పలు తప్పడం లేదు.
కాలం చెల్లిన బస్సులు
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎప్పుడో కొనుగోలు చేసినవి కావడంతో నిత్యం నడి రోడ్లపై సిటీ బస్సుల మొరాయింపు నిత్యకృత్యంగా మారింది. ట్రాన్స్ పోర్ట్ నిబందనల ప్రకారం 15 లక్షల కిలోమీర్లు ప్రయాణించడం లేదా15 సంవత్సరాలు నిండిన బస్సులను స్క్రాప్‌గా పరిగణిస్తారు. గ్రేటర్ ఆర్టీసీలో ప్రస్తుతం ఉన్న 28 వందల బస్సుల్లో సగానికి పైగా బస్సులు కాల పరిమితి తీరినవేనని తెలుస్తోంది. ప్రస్తుతం కొత్త బస్సులను కొనుగోలు చేయలేని స్థితిలో ఉన్న సంస్థ వాటికే తాత్కాలిక మరమ్మత్తులు చేస్తున్నారు. నిత్యం సర్వీసింగ్ చేయడం, బ్రేకులు తదితర కండీషన్‌ను ఒకటికి పదిసార్లు చెక్‌చేసిన తర్వాత రోడ్లపైకి తెస్తున్నారు. మూలన పడాల్సిన బస్సులను రోడ్లపై తిప్పడం వల్ల నిర్దేశించిన మైలేజి రాక సిబ్బంది తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని తెలుస్తోంది.
ప్రయాణికుల పాట్లు
టీఎస్‌ఆర్టీ సీ బస్సులు నడుస్తూ… నడుస్తూనే నడిరోడ్డుపై మొరాయించడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కిన సందర్భాలు, ఎత్తుగడ్డలు, చిన్న పాటి ఘాట్ రోడ్లు ఎదురైనప్పుడు బస్సులు బ్రేక్ డౌన్ అవుతున్నాయి. అత్యవసర పనులు, కార్యాలయాలకు వెళ్లేవారికి బస్సుల మొరాయింపు వల్ల సమయానికి చేరుకోలేక పోతున్నారని తెలుస్తోంది. ట్రాఫిక్‌తో పడుతున్న ఇబ్బందులు చాలవన్నట్టు ఈ డొక్కు బస్సులతో నానా అవస్థలు పడుతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.