తమిళనాడులో గవర్నర్‌కు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య తలెత్తిన విభేదాలు అనూహ్య పరిణామాలకు దారితీస్తున్నాయి. ప్రభుత్వ నిర్ణయాలను, అసెంబ్లీ చేసిన చట్టాలను గవర్నర్ తొక్కిపెడుతున్న నేపథ్యంలో గవర్నర్ అధికారాలకే కత్తెర వేసేలా ముఖ్యమంత్రి స్టాలిన్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నారు. తాజాగా, రాష్ట్రంలోని 13 విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల నియామకంలో గవర్నర్ అధికారాలను తొలగించేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వర్శిటీల వీసీలను రాష్ట్ర ప్రభుత్వమే నియమించేలా తమిళనాడు విశ్వవిద్యాలయాల చట్టంలో సవరణలు చేస్తూ అసెంబ్లీలో బిల్లు తీసుకొచ్చింది. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి కె. పొన్ముడి సోమవారం ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా బిల్లుపై ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడుతూ.. ”సంప్రదాయం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి గవర్నర్ వర్శిటీల వైస్ ఛాన్సలర్లను నియమిస్తారు. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా గవర్నర్లు దాన్ని తమ ప్రత్యేక హక్కు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. ఇది ప్రభుత్వాన్ని అగౌరవపర్చడమే గాక, ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధం. అంతేగాక, వైస్ ఛాన్సలర్ల నియామకం విషయంలో ప్రభుత్వానికి అధికారం లేకపోవడం ఉన్నత విద్యపై ప్రభావం చూపిస్తోంది. వర్సిటీల పాలనావ్యవహారాల్లోనూ గందరగోళం సృష్టిస్తోంది” అని పేర్కొన్నారు. ఏఐఏడీఎంకే, బీజేపీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సభనుంచి వాకౌట్ చేశాయి. చివరకు మూజువాడి ఓటుతో రెండు బిల్లులను సభ ఆమోదించినట్లు స్పీకర్ ఎం అప్పారావు తెలిపారఏు.
గుజరాత్‌లోనూ రాష్ట్ర ప్రభుత్వానిదే అధికారం..
ఈ సందర్భంగా 2010లో మాజీ సీజేఐ మదన్ మోహిన్ పూంఛీ నేతత్వంలోని కమిషన్ ఇచ్చిన నివేదికను స్టాలిన్ ప్రస్తావించారు. యూనివర్శిటీల ఛాన్సలర్ పదవి నుంచి గవర్నర్‌ను తొలగించాలని ఆ కమిటీ సిఫార్సు చేసినట్లు గుర్తుచేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్‌లోనూ వీసీలను గవర్నర్ నేరుగా నియమించరు. రాష్ట్ర ప్రభుత్వ కమిటీ సిఫార్సు చేసిన ముగ్గురు అభ్యర్థుల్లో ఒకరిని వీసీగా ఎంచుకుంటారు అని స్టాలిన్ అన్నారు. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలోనూ ఇదే విధానం కొనసాగుతున్నదని గుర్తుచేశారు. కాగా తమిళనాడులోని రాష్ట్ర, కేంద్ర, ప్రైవేటు యూనివర్శిటీల వైస్ ఛాన్సలర్ల సదస్సు యాదృచ్ఛికంగా సోమవారం ప్రారంభమైంది. ఈ సదస్సును రాష్ట్ర గవర్నర్ ఆర్ఎన్ రవి ప్రారంభించారు. ఇదే సమయంలో స్టాలిన్ ప్రభుత్వం గవర్నర్ అధికారాల్లో కోత విధించేలా బిల్లు తీసుకురావడం గమనార్హం.
గవర్నర్ అధికారాలకు కత్తెర, తమిళనాడు ప్రభుత్వం సంచలన నిర్ణయం
Advertisement
తాజా వార్తలు
Advertisement