న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : విద్యార్థుల్లో విజ్ఞానశాస్త్రం, సాంకేతికత తదితర అంశాలపై బాల్యం నుంచే ఆసక్తిని పెంపొందించేందుకు ఈ విషయాలను వివిధ భారతీయ భాషల్లో బోధించేందుకు అనుగుణమైన వ్యవస్థను రూపొందించాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు సూచించారు. విజ్ఞానశాస్త్ర సంబంధిత ఆసక్తిని పెంపొందించుకోవడం విద్యార్థుల ప్రాథమిక హక్కు అంటూ ఈ అంశాన్ని రాజ్యాగంలోనూ పేర్కొన్న విషయాన్ని ఉపరాష్ట్రపతి గుర్తు చేశారు. భారతదేశ యువతలో శక్తిసామర్థ్యాలకు కొదువలేదని, అయితే భారతీయ భాషల్లో ఈ విషయాలను బోధించడం ద్వారా వారిలో నెలకొన్న ప్రతిభాపాటవాలకు సానబెట్టి ప్రోత్సహించడం ద్వారా దేశనిర్మాణంలో వారందరినీ మరింత భాగస్వాములు చేసేందుకు వీలుంటుందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు.
కృత్రిమమేథ తదితర సాంకేతికతల ప్రయోజనాలను ప్రజల జీవితాల్లో ప్రతిబింబించేలా మరింత కృషి జరగాలని ఉపరాష్ట్రపతి సూచించారు. శాస్ర, పరిశోధన రంగాల్లో ఉన్నవారు తమ పరిశోధనల ఫలాలను ప్రలజకు మరింత చేరువ చేయాలని, ఇందుకోసం కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) బాటలోనే ‘విజ్ఞానపరమైన సామాజిక భాధ్యత’ శాస్త్రవేత్తలు అవలంభించాలని వెంకయ్య అన్నారు. జాతీయ గణితదినోత్సవం (ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక విభాగం, విజ్ఞాన్ ప్రసార్, ఆధ్వర్యంలో భారతీయ శాస్త్రవేత్తల విజయాలను గుర్తుచేసుకుంటూ ఏడాదివ్యాప్తంగా చేపట్టిన సంబరాలను విజ్ఞాన్ భవన్‌లో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీనివాస రామానుజన్ తోపాటు భారతదేశానికి గర్వకారణంగా నిలిచిన విజ్ఞానవేత్తలందరినీ ఉపరాష్ట్రపతి స్మరించుకున్నారు.
రామానుజన్ తోపాటు ఎందరోమంది గణిత శాస్త్రవేత్తలు, విజ్ఞానవేత్తలు జాతినిర్మాణంలో తమ పాత్రను ఎంతో సమర్థవంతంగా పోషించారని ఆయన గుర్తు చేశారు. విజ్ఞానశాస్త్రం, సాంకేతికత, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) అంశాల్లో నెలకొన్న లింగ అసమానతలను పరిష్కరించడంలోనూ ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాలని వెంకయ్య నాయుడు సూచించారు. స్టెమ్ విషయాల్లో 42 శాతం మహిళలు గ్రాడ్యుయేషన్ పూర్తిచేస్తున్నప్పటికీ.. ఇందులో 16.6% మంది మహిళలే పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో శాస్త్ర, సాంకేతిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్, భారత ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ కె.విజయ్ రాఘవన్, శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి డాక్టర్ శ్రీవారి చంద్రశేఖర్, విజ్ఞాన్ ప్రసార్ డైరెక్టర్ డాక్టర్ నకుల్ పరాశర్ తో పాటు శాస్త్రవేత్తలు, పరిశోధకులు, వివిధ రంగాల ప్రముఖులు పాల్గొన్నారు.