Saturday, November 23, 2024

భాగ్యనగరానికి మరో మణిహారం..

దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌కు మరో అత్యున్నత స్థాయి సంస్థ రానుంది. ఇప్పటికే హైటెక్‌ సిటీ, ఫార్మాసిటీ వంటి సిటీలతో.. హైదరాబాద్‌ దేశం చూపును తనవైపు తిప్పుకోగా, ఇపుడు మరో సిటీ ఏర్పాటు దిశగా ప్రతిపాదనలు కదులుతున్నాయి. తెెలంగాణకు కేంద్రం ఏం ఇచ్చిందంటూ పదే పదే రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలు మాట్లాడుతున్న తరుణంలో వారికి చేతి నిండా పని పెట్టే ప్రతిపాదన ఒకటి రాష్ట్రానికి వచ్చింది. హైదరాబాద్‌ మహానగరంలో సైన్స్‌ సిటీ ఏర్పాటు ప్రతిపాదనను కేంద్రపర్యాటక శాఖామంత్రి కిషన్‌రెడ్డి రాష్ట్రానికి పంపారు. కేంద్ర పర్యాటక అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో సైన్స్‌ మ్యూజియాల జాతీయ మండలి దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పలు నగరాల్లో సైన్స్‌ సిటీలు, సైన్స్‌ సెంటర్లు, ఇన్నోవేషన్‌ హబ్‌లు, డిజిటల్‌ ప్లానటోరియాల్ని ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా హైదరాబాద్‌ మహానగరంలో సైన్స్‌ సిటీని ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఇటీవల లేఖ రాశారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఏర్పాటు చేసే ఈ ప్రాజెక్టు వివరాల్ని తెలంగాణ ప్రభుత్వానికి పంపారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఈ సైన్స్‌ సిటీలో భాగంగా ఇంటరాక్టివ్‌ సెషన్‌ ఎగ్జిబిషన్‌ హాళ్లు, డిజిటల్‌ థియేటర్లు, త్రీడీషోలు, స్పేస్‌ సైన్స్‌ ఎగ్జిబిషన్‌ కేంద్రాలు, అవుట్‌ డోర్‌ సైన్స్‌ పార్కులు, ఆడిటోరియం, వర్క్‌ షాపులు ఏర్పాటు అవుతాయి. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను రాష్ట్రానికి పంపించారు. ఇందుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికను రాష్ట్రం కేంద్రానికి పంపిన అనంతరం కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది. రాష్ట్రాల్లో ఏర్పాటు చేసే సైన్స్‌ సిటీలను సాధారణంగా రాష్ట్ర రాజధాని నగరాల్లోనే నిర్మిస్తుంటారు. ఈ ప్రాజెక్టుకు అవసరమైన నిధుల్ని కేంద్రం, రాష్ట్రం ఉమ్మడి భాగస్వామ్యంతో నిర్మించాల్సి ఉంటుంది. ఇందు కోసం దాదాపు 25 నుంచి 30 ఎకరాల భూమి అవసరమవుతుంది. ఈ భూమిని రాష్ట్రం కేటాయించాల్సి ఉంటుంది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ. 232 కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇందులో పెట్టుబడి వ్యయం రూ. 179 కోట్లు అయితే, కార్పస్‌ ఫండ్‌ రూ. 53.7 కోట్లు, కేంద్రం వాటా 60 శాతం రాష్ట్రం వాటా 40 శాతంగా ఉంటుంది.

భవిష్యత్‌ తరాలకు వరం..
సైన్స్‌ సిటీ ఏర్పాటుతో శాస్త్ర సాంకేతిక రంగాలపై యువతలో ఆసక్తిని పెంచటంలో కీలక భూమిక పోషిస్తుంది. ఇంజనీరింగ్‌, గణితం పరిశోధనలపై అవగాహన కల్పిస్తుంది. ప్రత్యేక పర్యాటక కేంద్రంగా గుర్తింపు ఉంటుంది. సామాన్యులకు సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచేలా ప్రదర్శనలు, చర్చలు, వర్క్‌షాపుల నిర్వహణతో పాటు ప్రముఖుల ప్రసంగాలు కూడా ఉంటాయి. కొత్త పరికరాల తయారీతో సహా వివిధ అంశాలపై అవగాహన పెంచుతారు. సైన్స్‌ టీచర్లు, విద్యార్థులు, ఎంటర్‌ప్రెన్యూర్‌లతో సహా వివిధ వర్గాలకు ప్రత్యేక శిక్షణను ఇస్తారు. ఈ ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుని భూకేటాయింపులు జరిపితే ఎన్నో శాస్త్ర సాంకేతిక పరిశోధనలకు కేంద్రంగా ఉన్న తెలంగాణ రాష్ట్రం మరో ప్రముఖ సంస్థకు కేంద్రంగా మారనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement