కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్కూళ్లలోనూ కరోనా విస్తరిస్తున్న సమయంలో పాఠశాలలను మూసివేయాలని నిర్ణయించింది. దీంతో మంగళవారం నుంచి స్కూళ్లు మూసివేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వరకు స్కూళ్లు వేస్తున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. కరోనా పరిస్థితులపై సోమవారం సీఎం జగన్ అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సమావేశంలో స్కూళ్లు బంద్ చేయాలని నిర్ణయించారు.
అటు స్కూళ్లు మూసివేసినా పరీక్షలను మాత్రం యధావిధిగా నిర్వహిస్తామని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. షెడ్యూల్ ప్రకారమే 10వ తరగతి, ఇంటర్ పరీక్షలు జరుగుతాయని మంత్రి ప్రకటించారు. చిన్నారులు వైరస్ బారిన పడుతూ, ఇంట్లో వారు వైరస్ బారిన పడేందుకు కారణం అవుతున్నాయన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని 9వ తరగతి వరకు పాఠశాలలను మూసివేస్తున్నట్లు మంత్రి తెలిపారు. 1 నుంచి 9వ తరగతి చదివే విద్యార్థులను పై తరగతులకు ప్రమోట్ చేస్తామన్నారు. అటు ఈసారి ఇతర రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలను రద్దు చేసినప్పటికీ… విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకే పరీక్షలు పెడుతున్నామని, క్లాసుల నిర్వహణ పూర్తైనందున పరీక్షలను కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా షెడ్యూల్ ప్రకారం నిర్వహిస్తామన్నారు.