Wednesday, November 13, 2024

Fatal Killings – స్కానింగ్ సెంట‌ర్ లలో దారుణాలు ….భూమి మీదకు రాకుండానే క‌డ‌తేరుతున్న‌ ల‌క్ష్మీదేవిలు

అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: ఆడబిడ్డలు ఇంటికి మహా లక్ష్మి అంటారు…. గతంలో ఆడపిల్ల పుడితే చాలు లక్ష్మీ దేవి పుట్టిందని సంబరపడేవారు… ఇప్పటికీ ఆతరహాలో ఆడపిల్ల పుట్టాలని ఎదురుచూసే కుటుంబాలు ఉన్నప్పటికీ ఎక్కువ మంది మాత్రం ఆడబిడ్డ అంటే ఇంకా అలుసుగానే చూస్తున్నారు. ఆడపిల్ల పుడితే ఖర్చు ఎక్కువ అని అందు కోసం తల్లి గర్భంలోనే డబ్బు ఖర్చుపెట్టయినా సరే పిండ దశలోనే విచ్ఛిన్నం చేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతూనే ఉంది. గతంతో పోలిస్తే స్వల్పంగా పెరిగినప్పటికీ మొత్తం మీద ప్రతి వెయ్యి మంది మగవారికి 966 మంది మాత్రమే మహిళలు ఉన్నారంటే రాష్ట్రంలో బాలికల సంఖ్య ఏమేరకు తగ్గుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు లింగ నిర్ధారణ పరీక్షలను పూర్తిగా వ్యతిరేకిస్తూ స్కానింగ్‌ సెంటర్లపై ఎప్పటికప్పుడు కొరఢా ఝుళిపిస్తున్నా గుట్టుచప్పుడు కాకుండా కొన్ని స్కానింగ్‌ సెంటర్లలో లింగ నిర్ఱారణ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే తల్లి గర్భంలో ఉన్న పిండం ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి స్కానింగ్‌ చేయాలే తప్ప పిండానికి సంబంధించి లింగ నిర్ధారణ నివేదికను మాత్రం బహిర్గతం చేయకూడదు. ఇదే విషయాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు పదే పదే స్కానింగ్‌ కేంద్రాల నిర్వాహకులకు చెబుతూ హెచ్చరికలు కూడా జారీ చేస్తున్నారు. అయినా రాష్ట్రంలోని పలు పట్టణ ప్రాంతాల్లోని భారీ స్కానింగ్‌ఒ కేంద్రాల్లో క్యాష్‌ కొడితే చాలు .. గుట్టుచప్పుడు కాకుండా నివేదికలు ఇచ్చేస్తున్నారు. దీంతో గర్భంలో ఆడ బిడ్డ ఉందని తెలియగానే కొంత మంది కుటుంబ సభ్యులు ఆడపిల్ల అవసరం లేదంటూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్నారు.

పిండ దశలోనే విచ్ఛిన్నం
తల్లి గర్భంలో ఉన్నది ఆడ, మగ తెలుసుకోవడానికి గతంలో తొమ్మిది నెలలు సమయం పట్టేది. ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న సాంకేతిక పరిజ్ఞానంతో ఐదో నెల దాటిన తరువాతే కడుపులో ఉన్నది ఎవరనేది చెప్పేస్తున్నారు. ఆదిశగానే స్కానింగ్‌ కేంద్రాలు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి పట్టణ ప్రాంతంలోనూ అందుబాటులోకి వచ్చాయి. దీంతో కొంత మంది తల్లిదండ్రులు మొదటి సంతానం ఆడ బిడ్డ పుట్టినప్పటికీ రెండో సంతానం మగ బిడ్డ కావాలని కోరుకుంటున్నారు. అందుకోసం పూజలు చేయడంతోపాటు గర్భం దాల్చాక ఆడొ, మగో తెలుసుకోవడానికి స్కానింగ్‌ఒసెంటర్లకు క్యూ కడుతున్నారు. ఈక్రమంలో రెండో కాన్పులో కూడా ఆడ బిడ్డ అని నిర్ధారణ అయితే పిండ దశలోనే విచ్ఛిన్నం చేస్తున్నారు. అందుకు కొంత మంది ప్రైవేటు వైద్యులు కూడా సహకారం అందిస్తున్నారు. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ తరహా ప్రక్రియ జోరుగా సాగుతోంది

అదనంగా క్యాష్‌ కొడితే .. పిండ నిర్ధారణ
లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినా అందుకు సంబంధించిన నివేదికలను గోప్యంగా ఉంచాలని ప్రభుత్వం పదే పదే స్కానింగ్‌ సెంటర్లకు హెచ్చరికలు చేస్తూనే ఉంది. ఆ దిశగా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా పలు స్కానింగ్‌ సెంటర్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించి కేసులు కూడా నమోదు చేస్తున్నారు. అనేక సందర్భాల్లో అనుమతులు కూడా తాత్కాలికంగా నిలిపివేస్తున్నారు. అయితే, మరోవైపు స్కానింగ్‌ సెంటర్లలో యథేచ్ఛగా లింగ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తూనే ఉన్నారు. అందుకోసం ప్రభుత్వ నిబంధనలు బూచిగా చూపించి ఎక్కువ మొత్తంలో డబ్బు వసూలు చేస్తున్నారు. కడుపులో ఉన్న బిడ్డ ఆడో. మగో తెలుసుకోవాలన్న ఆతృతతో కుంటుంబ సభ్యులు అధికంగా క్యాష్‌ కొట్టడానికైనా సిద్ధపడుతున్నారు. దీంతో ఆడ బిడ్డ వద్దనుకుంటే కడుపులోనే పిండాన్ని తొలగించేస్తున్నారు. ఫలితంగా రాష్ట్రంలో బాలికల సంఖ్య ఆశించిన స్థాయిలో పెరగడం లేదు.

పెరుగుతున్న పెళ్లికాని ప్రసాదులు
రాష్ట్రంలో ప్రతి వెయ్యి మంది పురుషులకు 966 మంది మహిళలు ఉన్నారు. గతంలో అయితే వెయ్యి మందికి 934 మంది మాత్రమే మహిళలు ఉండేవారు. ఇటీవలి కాలంలో కొంత మేర భ్రూణ హత్యలు తగ్గుముఖం పట్టడంతో బాలికల సంఖ్య కొంత మేర పెరిగింది. అయినా కూడా రాష్ట్రవ్యాప్తంగా మహిళల సంఖ్య మాత్రం తక్కువగానే ఉంది. దీంతో పెళ్లికాని ప్రసాదుల సంఖ్య క్రమేణా పెరిగిపోతుంది. గతంలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండేవారు. దీంతో పురుషులకు పెళ్లిళ్లు త్వరత్వరగా కుదిరేవి. ప్రస్తుతం అందుకు పూర్తి భిన్నంగా మహిళల సంఖ్య తక్కువగా ఉండటంతో పురుషులకు పెళ్లి కావాడం ఇబ్బందిగా మారింది. గతంలో పెళ్లి చూపుల్లో అబ్బాయికి అమ్మాయి నచ్చితే చాలనుకునేవారు. ఇప్పుడా పరిస్థితులు మారిపోయాయి. అబ్బాయికి అమ్మాయి నచ్చితేనే మిగతా పెళ్లి వ్యవహారం నడుస్తుంది. అందుకు బలమైన కారణాలు లేకపోలేదు. రాష్ట్రవ్యాప్తంగా ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో బాలికల సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఫలితంగా పెళ్లిగాని ప్రసాదుల సంఖ్య మరింత పెరుగుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement