ప్రభుత్వ పాఠశాలల్లో చదివే బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందించేలా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టులో పిల్ దాఖలైంది. దీనిపై ఇవ్వాల (సోమవారం) విచారణ జరిపిన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వంతోపాటు, రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి స్పందన తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 12వ తరగతి చదువుతున్న బాలికలకు ఉచితంగా శానిటరీ ప్యాడ్‌లు అందించాలని మధ్యప్రదేశ్‌కు చెందిన డాక్టర్, సామాజిక కార్యకర్త జయ ఠాకూర్ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.
ఆమె అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ పీఎస్ నరసింతో కూడిన ధర్మాసనం దీన్ని విచారణకు స్వీకరించి.. కేంద్ర ప్రభుత్వానికి, అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ, ప్రభుత్వ-ఎయిడెడ్ పాఠశాలల్లోని బాలికల హెల్త్ పరంగా ఎన్నో సమస్యలు వస్తున్నాయని, వారి విషయంలో పరిశుభ్రతకు ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఆ సమస్యను పిటిషనర్ లేవనెత్తారు. ఈ విషయంలో సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా సహాయాన్ని కూడా సుప్రీంకోర్టు కోరింది.