Wednesday, November 20, 2024

హుజురాబాద్ లో దళిత బంధు లొల్లి

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న దళితబంధు పథకం అమలు చేయనున్న వేళ.. ఆదిలోనే ఎస్సీల నుంచి నిరసనలు ఎదురవుతున్నాయి. ఈ పథకాన్ని ఈ నెల 16న కరీంనగర్​ జిల్లా హుజూరాబాద్​లో పైలెట్​ ప్రాజెక్టుగా ప్రారంభించనున్నారు. శాలపల్లిలో జరిగే సీఎం సభలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. అయితే కందుగుల గ్రామంలో దళిత బంధు పథకంలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేయడంపై దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

హుజూరాబాద్​ మండలం కందుగుల గ్రామం నుంచి 8 మందిని మాత్రమే ఎంపిక చేయడంపై ఆ గ్రామంలోని ఎస్సీలు ఆందోళన బాటపట్టారు. లబ్దిదారుల జాబితాతో దళితవాడకు వచ్చిన అధికారి నుంచి జాబితాను లాక్కొని చింపివేశారు. గ్రామంలో 150 మంది వరకు ఎస్సీలు ఉండగా కేవలం 8 మందిని మాత్రమే అర్హులుగా గుర్తించడమేమిటని ప్రశ్నించారు. తమ పేర్లు ఎందుకు చేర్చలేదని ధర్నాకు దిగారు. హుజూరాబాద్‌-పరకాల రహదారిపై ఎస్సీ కాలనీ వాసులు బైఠాయించటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పథకంలో తమ పేర్లు చేర్చాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు వీణవంక తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ఎస్సీలు ఆందోళన చేశారు. దళితబంధు లబ్ధిదారుల ఎంపికలో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. అనర్హులను ఎంపిక చేశారని ఆరోపిస్తూ తహసీల్దార్‌తో వాగ్వాదానికి దిగారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement