రేప్ కేసులో అరెస్ట్ వారెంట్‌ను ఎదుర్కొంటున్న లోక్ ఇన్సాఫ్ పార్టీ ఎమ్మెల్యే సిమర్జిత్ సింగ్ బెయిన్స్ ను ఒక వారం పాటు అరెస్ట్ చేయవద్దని పంజాబ్ పోలీసులను సుప్రీంకోర్టు ఇవ్వాల ఆదేశించింది. ఓ మహిళ తనను ఎమ్మెల్యే రేప్ చేశారని ఆరోపించడంతో ఈ కేసు నమోదు అయ్యింది. కాగా ఈ కేసులో పంజాబ్ ప్రభుత్వంతో పాటు, బైన్స్ పై కూడా సుప్రీంకోర్టు చురకలంటించింది. అత్యాచార ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత ఫిర్యాదుదారుపై నాలుగు క్రిమినల్ కేసులు నమోదు కావడమే దీనికి కారణంగా తెలుస్తోంది. ప్రస్తుతం బెంచ్ ఈ కేసు విచారణకు సంబంధించి అన్ని చర్యలను ఆపేస్తున్నట్టు తెలిపింది. తదుపరి విచారణ తేదీలోపు ఈ విషయంలో ప్రత్యుత్తరాలు దాఖలు చేయాలని పంజాబ్ పోలీసులు, బైన్స్, ఫిర్యాదుదారు మహిళను కూడా కోర్టు ఆదేశించింది. కాగా, ఈ కేసు వచ్చే వారం విచారణకు రానున్నట్టు అధికారులు తెలిపారు.
పంజాబ్‌లోని లూథియానా జిల్లాలోని ఆటమ్ నగర్ అసెంబ్లీ స్థానానికి సిమర్జిత్ సింగ్ బైన్స్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అత్యాచారం కేసులో తనపై ట్రయల్ కోర్టు జారీ చేసిన నాన్-బెయిలబుల్ వారెంట్లపై స్టే ఇవ్వకుండా పంజాబ్, హర్యానా ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అతను పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు నామినేషన్ పత్రాలను దాఖలు చేయడానికి, ప్రచారం చేయడానికి రిలీఫ్ కోసం సుప్రీంలో పిటిషన్ దాఖలు చేయగా.. దీనిని అత్యాచార బాధితురాలి న్యాయవాది వ్యతిరేకించారు.