ఒడిశా రైలు ప్రమాదం ఘటనా స్థలం బీతావహంగా ఉందని, ప్రమాదం నుంచి బయటపడిన ఓ వ్యక్తి తెలిపాడు. ఒక్కసారిగా రైలు కుదుపులకు గురవ్వడంతో తాను మేలుకున్నానని, అయితే.. అప్పటికే రైలు బోగీలు పట్టాలు తప్పాయని తెలిపాడు. తనపై 10, 15 మంది పడిపోయారన్నాడు. ఇక వారిని తప్పించుకుని బయటకు వస్తున్న క్రమంలో చేతికి, మెడకు తీవ్ర గాయామైందని.. ఎలాగోలా తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డట్టు చెప్పాడు. అయితే.. తాను రైలులోంచి బయటికి రాగానే అక్కడక్కడా అవయవాలు కనిపించాయని, ఇక్కడ ఒక కాలు, అక్కడ ఒక చేయి. ఒకరి ముఖం వికృతంగా ఉందని కన్నీటి పర్యంతమవుతూ పరిస్థితిని వివరించాడు. ప్రమాదం జరిగిన ప్రదేశంలో అవయవాలు ఎక్కడికక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్నాయని ఘటనాస్థలి బీభత్సాన్ని తెలియజేశాడు.
కాగా, ఈ ఘటనలో తొలుత కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పగా, అది వెళ్లి పక్కనే లూప్ లైన్లో ఉన్న గూడస్ రైలును ఢీకొట్టింది. ఇలా ఆ రైలు బోగీలు మరో లైన్లోకి దొర్లుకుంటూ పోయాయి. అయితే.. ఆ రూట్లో వస్తున్న యశ్వంతపూర్ రైలు కూడా ప్రమాదినికి గురైన రైలు బోగీలను ఢీకొట్టింది. దీంతో ఒకే చోట మూడు రైళ్లు ఢీకొన్నట్టు అయ్యింది. ఈ దుర్ఘటనలో ఇప్పటి వరకు అయితే 50 మంది చనిపోయారని, మరో 400 మందికి పైగా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.
కాగా, కోల్‌కతా నుంచి చెన్నైకి వెళ్తున్న కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, బెంగళూరు నుంచి కోల్‌కతా వెళ్తున్న యశ్వంత్‌పూర్ రైలు.. పట్టాలు తప్పిన కోచ్‌లను ఢీకొట్టిందని రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అమితాబ్ శర్మ తెలిపారు. కోల్‌కతా సమీపంలోని షాలిమార్ స్టేషన్ నుండి చెన్నై సెంట్రల్ స్టేషన్‌కు రైలు వెళ్తుండగా బహనాగ బజార్ స్టేషన్ సమీపంలో రాత్రి 7.20 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు.