– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
కాంగ్రెస్ హైకమాండ్ ఈ మధ్య ప్రకటించిన పలు పార్టీ పదవుల్లో తమకు సముచిత న్యాయం దక్కలేదని పార్టీకి చెందిన కొంతమంది సీనియర్ లీడర్లు మనస్తాపానికి గురయ్యారు. అందులో వరంగల్ జిల్లాకు చెందిన సీనియర్ లీడర్ కొండా సురేఖ బాహాటంగా తనకు అప్పగించిన పదవికి రాజీనామా చేశారు. ఇక ఆ తర్వాత పలువురు లీడర్లు ఒక్కొక్కరుగా తెరమీదకు వస్తూ తమకు సరైన అవకాశాలు ఇవ్వడం లేదని ఆరోపణలకు దిగుతున్నారు.
ఇక.. ఇవ్వాల (శనివారం) హైదరాబాద్‌లో రెండు గంటలపాటు జరిగిన భేటీలో కొత్త కమిటీలో కాంగ్రెసోళ్లకు జరిగిన ‘అన్యాయం’పై పరిశీలించామని సీనియర్ నేత, సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క అన్నారు. ఈ ప్రక్రియలో తన ప్రమేయం లేదని, తన అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోలేదని చెప్పారు. ‘సేవ్ కాంగ్రెస్’ ప్రచార నినాదంతో ముందుకు సాగాలని ఇవ్వాల జరిగిన సమావేశంలో సీనియర్ లీడర్లంతా తీర్మానించినట్టు ఆయన తెలిపారు. సీనియర్ నేతలను కించపరిచేలా, వారి పాత్రను హతమార్చేందుకు సోషల్ మీడియాలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోందని, దీనిని ఖండిస్తున్నట్టు చెప్పారు. కాగా, ప్రకటించిన 108 స్థానాల్లో 54 స్థానాలు టీడీపీ నుంచి వచ్చిన వారికే దక్కాయని మరో ముఖ్య నేత ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని కాపాడుకునేందుకు యత్నిస్తుంటే వారిని కోవర్టులు అని ఎలా అంటారని మరో సీనియర్ నేత, ఎమ్మెల్యే జగ్గా రెడ్డి ప్రశ్నించారు. పీసీసీ, ఏఐసీసీ ఇన్‌చార్జిలు తమపై సోషల్ మీడియా దాడిని ఖండించలేదని మండిపడ్డారు. “నాలుగు పార్టీలు మారిన వారు కాంగ్రెస్‌లోకి వచ్చి తాము ఎలా పనిచేయాలో చెప్పలేరని మరో నేత రాజనర్సింహ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక.. ఇంకో సీనియర్ లీడర్ అయిన మధు యాస్కీ ఈ పోరాటాన్ని ‘నిజమైన కాంగ్రెస్‌మెన్ Vs బయటి వ్యక్తులు’గా అభివర్ణించారు.
కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ‘భారత్ జోడో యాత్ర’ పాదయాత్ర చేస్తున్న తరుణంలో తెలంగాణలో పార్టీలో చిచ్చురేగి విభజనకు దారితీయడం వంటి ఘటనలు జరుగున్నాయి. గత నెలలో తెలంగాణలో రాహుల్ పాదయాత్ర చేస్తున్నప్పుడు సీనియర్ నేతలంతా కలిసి పాల్గొన్నారు. కానీ, అంతలోనే ఇట్లా జరిగిందనే వాదనలు వినిపిస్తున్నాయి.