కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మక ర్యాలీ, భారత్ జోడో యాత్రలో పెను దుమారం చెలరేగింది. 14వ రోజున పార్టీ అధినేత రాహుల్ గాంధీ కేరళలోని ఎర్నాకులం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నారు. రాహుల్‌తో కలిసి నడిచేందుకు పార్టీ నాయకత్వం కిందిస్థాయి కార్యకర్తలను రప్పిస్తోంది. అయితే వారి ర్యాలీ కేరళలోని ఎర్నాకులం జిల్లాకు చేరుకోగానే వారికి ఊహించని పొరపాటు ఒకటి ఎదురయ్యింది.
పాదయాత్ర పోస్టర్లో వీడీ సావర్కర్ ఫొటో ఉండడమే దీనికి కారణంగా తెలుస్తోంది. సావర్కర్ ఇతర స్వాతంత్య్ర సమరయోధులతో కలిసి ఉన్న ఫొటో పలు బ్యానర్లు, బోర్డులలో కనిపించింది. అయితే కాంగ్రెస్ పార్టీ సావర్కర్‌ను ఎప్పుడూ స్వాతంత్ర్య సమరయేధుడిగా గుర్తించలేదు. అతను బ్రిటిష్ వారితో పోరాడకుండా క్షమాపణలు మాత్రమే చెప్పాడని పార్టీ నేతలు చెబుతుంటారు.
ఈ విషయాన్ని తొలుత కేరళ స్వతంత్ర ఎమ్మెల్యే పీవీ అన్వర్ గమనించారు. కాంగ్రెస్ భారత్ జోడో యాత్రలో భాగంగా చెంగమనాడ్లో ఉంచిన బోర్డులపై సావర్కర్ ఫొటో ఉందని అన్వర్ సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. సావర్కర్ ఫొటో కనిపించకుండా ప్రస్తుతం మహాత్మా గాంధీ ఫొటోతో కవర్ చేశారని ఆయన తెలిపారు.