తమిళనాడు మాజీ సీఎం జయలలిత స్నేహితురాలు వీకే శశికళ మళ్లీ రాజకీయాల్లో రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నారు. జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటానని ప్రకటించిన శశికళ.. తమిళ పాటిటిక్స్ లోకి రావాలని భావిస్తున్నారు. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆమె రాజకీయాల్లోకి రావాలని నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో మెరీనాబీచ్‌లోని మాజీ సీఎంలు జయలలిత, ఎంజీ రామచంద్రన్, సీఎన్ అన్నాదురై సమాధులను సందర్శించి నివాళులర్పిస్తానని తెలిపారు. శనివారం అన్నాడీఎంకే స్థాపించి 50 ఏళ్లు పూర్తవుతాయి. అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల వేళ ఆమె అన్నాదురై, ఎంజీ రామచంద్రన్, జయలలిత స్మారక చిహ్నాలను సందర్శిస్తానని ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే పార్టీ ఘోరంగా ఓటమిపాలైంది. ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరు నేతలు చిన్నమ్మ రాక కోసం ఎదురుచూస్తున్నారు. ఆమెని తిరిగి పార్టీలో ఆహ్వానిస్తే.. పార్టీ బలం పెరుగుతుందని శశికళ వర్గం భావిస్తోంది. అయితే, దీనికి మాజీ సీఎం పళనిస్వామి, పన్నీర్ సెల్వం అంగీకరిస్తారా? లేదా? అన్నది ఉత్కంఠగా మారింది. కాగా, అక్రమాస్తుల కేసులో బెంగళూరు జైలులో దాదాపు మూడేళ్ల శిక్ష అనుభవించిన శశికళ.. ఈ ఏడాదే ఫిబ్రవరిలో విడుదలైయ్యారు.
ఇది కూడా చదవండి: వీడిన సస్పెన్స్.. టీమిండియా హెడ్ కోచ్ గా గంగూలీ ఫ్రెండ్