Tuesday, November 26, 2024

అన్నాడీఎంకేలో శశికళ ఆడియో కలకలం

తమిళనాడు మాజీ సీఎం దివంగత జయలలిత స్నేహితురాలు శశికళ రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. అన్నాడీఎంకేపై తిరిగి పట్టు సాధించేందుకు పావులు కదుపుతున్నారు. సరైన సమయంలో రాజకీయాల్లోకి  వస్తానని, పార్టీ నుంచి తనను ఎవరూ వేరు చేయలేరని శశికళ ఇటీవల కార్యకర్తలతో వ్యాఖ్యానించారు. పార్టీని కాపాడుకునేందుకు తన శాయశక్తులా కృషి చేస్తానంటూ మాట్లాడిన ఆడియో ఒకటి ఇటీవల బయటకు వచ్చింది. పార్టీ శ్రేణులతో ప్రతిరోజూ శశికళ ఫోన్‌లో మాట్లాడుతున్నారు. దీనికి సంబంధించిన ఆడియో రికార్డులు అన్నాడీఎంకే వర్గాల్లో కలకలం సృష్టిస్తున్నాయి. గురువారం ఓ అన్నాడీఎంకే నేతతో శశికళ ఫోన్‌లో మాట్లాడుతున్న మరో ఆడియో బయటకు వచ్చింది. అన్నాడీఎంకే నుంచి తనను వేరుచేయలేరంటూ ఆ ఆడియోలో ఆమె పేర్కొన్నారు.

జైలు నుంచి విడుదలైన తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటూ ఆధ్యాత్మికత వైపు అడుగులు వేసినట్టు కనిపించి శశికళ.. మళ్లీ అన్నాడీఎంకేను చేతిలో తీసుకునేందుకు ప్రయత్నాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు అన్నాడీఎంకే శాసనసభాపక్షం ఈ నెల 14న సమావేశం కానుంది. అసెంబ్లీలో పార్టీ శాసనసభాపక్ష ఉపనేత, విప్‌లను ఎన్నుకునేందుకు ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. అటు అన్నాడీఎంకే నేతలు, ఎమ్మెల్యేలను మచ్చిక చేసుకుందుకు శశికళ వర్గం ప్రయత్నిస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో అన్నాడీఎంకే శాసనసభాపక్షం సమావేశం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

ఇక అన్నాడీఎంకే అగ్రనేతలు ఎడపాటి పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య అంతా సవ్యంగా లేదన్న ప్రచారం జరుగుతోంది. అన్నాడీఎంకే శాసనసభా పక్ష నేతగా మాజీ సీఎం పళనిస్వామి ఎన్నికయ్యారు. అయితే శాసనసభాపక్ష ఉపనేత, విప్ ఎంపిక విషయంలో ఆ పార్టీ అగ్రనేతలు పళనిస్వామి, పన్నీర్ సెల్వం మధ్య విబేధాలు నెలకొన్నట్లు తెలుస్తోంది. శాసనసభాపక్ష ఉపనేత పదవిని తీసుకునేందుకు పన్నీర్ సెల్వం సుముఖంగా లేరని తెలుస్తోంది. అసెంబ్లీలో విప్ చాలా కీలకమైన పదవి కావడంతో ఆ పదవిని తన మద్ధతుదారుడికి ఇవ్వాలని పన్నీర్ సెల్వం పట్టుబడుతున్నట్లు సమాచారం. దీంతో రెండు వర్గాల మధ్య విభేదాలను శశికళ వర్గం తమకు అనుకులంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోదని ప్రచారం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement